
రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) రచించిన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor) పుస్తకం ఆర్థిక విజ్ఞానంపై మన దృష్టిని పూర్తిగా మార్చేయగలదు. సంపదను నిర్మించడంలో మన ఆలోచనలు, అభ్యాసాలు ఎంత ముఖ్యమో ఈ పుస్తకం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ పాఠాలు సాధారణ జీవితంలో అమలు చేయగలిగినవే కావడంతో పాటు మన ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరిచే మార్గదర్శకాలు కూడా కావచ్చు. ధనవంతులు కావడానికి ఈ పుస్తకం నేర్పించే 10 శక్తివంతమైన డబ్బు పాఠాలు ఇప్పుడు చూద్దాం..
డబ్బు కోసం పని చేయొద్దు
ధనవంతులు తమ సమయాన్ని డబ్బు సంపాదించడంలో కాకుండా, డబ్బును పనిలో పెట్టి సంపద సృష్టించడంలో వినియోగిస్తారు. వారంతా పాసివ్ ఇన్కమ్ (Passive Income) అంటే పని చేయకుండా వచ్చే ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకుంటారు.
ఆర్థిక మేధస్సును పెంచుకోండి
పెట్టుబడులు, ఖర్చులు, ఆదాయం వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండటం అత్యంత కీలకం. ఆర్థిక విషయాల్లో అవగాహన పెరిగితే, మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు.
రిస్క్ తీసుకోవడానికి భయపడవద్దు
ధైర్యంగా ముందడుగు వేయాలకునేవారు మాత్రమే కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. లెక్కంచదగిన రిస్క్లను తీసుకోవడం సంపదను నిర్మించడంలో కీలకమైనదని కియోసాకి అంటారు.
పరపతిని వాడుకోండి
ఇతరుల డబ్బు, సమయం లేదా నైపుణ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ సంపదను నిర్మించవచ్చు. మీ పరపతిని సమర్థంగా వాడడం ద్వారా మీరు వేగంగా ఎదగవచ్చు.
ఖర్చు తగ్గించండి.. పెట్టుబడి పెంచండి
తక్కువ ఖర్చులతో జీవించడం, అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయడం సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఖర్చులపై స్పష్టమైన అవగాహన ఉంటే పెట్టుబడికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి.
రుణాన్ని తెలివిగా ఉపయోగించండి
ప్రయోజనకరమైన రుణం (Good Debt), నష్టాన్ని కలిగించే రుణం (Bad Debt) మధ్య తేడాను తెలుసుకోవడం అవసరం. రుణాన్ని సంపద నిర్మాణానికి ఉపయోగించండి.
ఆర్థిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వండి
సంపదను ఎలా సృష్టించుకోవాలో తెలుసుకోవాలంటే విద్య అవసరం. కానీ ఇది సాధారణ విద్య కాదు.. ఇది ఆచరణాత్మక ఆర్థిక జ్ఞానం.
సమృద్ధి మనస్తత్వాన్ని ఏర్పరచుకోండి
‘లేమి మనస్తత్వం’ స్థానంలో ‘సమృద్ధి దృక్పథం’ అవసరం. మీరు అవకాశాలను చూడగలగాలి. భవిష్యత్తుపై నమ్మకంతో ముందుకు సాగాలి.
వైఫల్యాలను ఆస్వాదించండి
విఫలమవడం తప్పు కాదు. అది ఒక అభ్యాసం. తప్పుల నుంచి నేర్చుకోవడమే వ్యక్తిగత, ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుంది.
మీపై మీరు పెట్టుబడి పెట్టండి
మీ ప్రతిభను పెంపొందించుకోవడంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ సంపాదన సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. నిరంతరం నేర్చుకుంటూ ఎదుగుదలవైపు పయనించండి.
ఈ పాఠాలు మీ ఆర్థిక ప్రయాణాన్ని మారుస్తాయి. సంపద వ్యక్తిగత అభివృద్ధి నుంచే ప్రారంభమవుతుంది. మొదటి అడుగు విజ్ఞానంతో ప్రారంభించండి. ఒకేసారి అంతా మారదు. కానీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ధనవంతులు కావచ్చని ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది.
ఇదీ చదవండి: బంగారాన్నే నమ్ముతా: జోహో సీఈఓ శ్రీధర్ వెంబు