
ఇది స్పీడ్ యుగం. కరచాలనాలైనా, కలహాలైనా ఎంత త్వరగా మొదలవుతాయో అంత త్వరగానూ కనుమరుగవుతాయి. భారత్–అమెరికాల సంబంధాల తీరు గమనిస్తే ఇది అర్థమవుతుంది. నెల్లాళ్ల క్రితం దాదాపు ఛిద్రమయ్యాయనుకున్న ఈ సంబంధాల్లో మళ్లీ సుహృద్భావం మొగ్గ తొడుగుతోంది. ద్వైపాక్షిక ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా సాకారం చేసుకోవాలని మంగళవారం న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య దూత బ్రెండాన్ లించ్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గంతో మన వాణిజ్య మంత్రిత్వ బృందం చర్చించాక అంగీకారం కుదిరింది.
అంతేకాదు... ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ట్రంప్ ఆయనకు ఫోన్‌చేసి శుభాకాంక్షలు చెప్పటం, దాన్ని ఎక్స్‌లో మోదీ ప్రస్తావించి రష్యా–ఉక్రెయిన్ ఘర్షణలకు శాంతియుత పరిష్కారం కోసం ట్రంప్ చొరవ తీసుకోవటాన్ని ప్రశంసించటం గమనించదగ్గవి. సరిగ్గా నెల్లాళ్ల క్రితం పరిస్థితి వేరు. రష్యా దురాక్రమణ యుద్ధం కొనసాగటానికి భారత్ వైఖరే ప్రధాన కారణమంటూ ట్రంప్ నిందించారు. అంత క్రితం ఆగస్టు మొదటి వారంలో విధించిన 25 శాతం సుంకాలతో పాటు రష్యా ముడిచమురు కొంటున్నందుకు ఆ నెల చివరిలో మరో 25 శాతం అదనంగా వడ్డించి దాన్ని 50 శాతానికి తీసుకెళ్లారు.
కేవలం భారత్‌పై విషం కక్కడం కోసం నియమితులైనట్టుగా వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మొదలుకొని వాణిజ్యమంత్రి హొవార్డ్ లుత్నిక్ వరకూ ఇష్టానుసారం మాట్లాడారు. వీరిలో నవారో మిగిలినవారికన్నా భిన్నం. ఆయన ఆశువుగా అబద్ధాలాడగలరు. ఆధారాలతోగానీ, ఇరు దేశాల చారిత్రక సంబంధ బాంధవ్యాలతో గానీ ఆయనకు పనిలేదు. ఫలానా కులానికి లబ్ధి చేకూర్చటం కోసం భారత ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతోందని వ్యాఖ్యానించగలరు.
ఇరు దేశాల మధ్యా చర్చలు మొదలవుతున్న తరుణంలో కూడా భారత్‌ను ‘ట్యారిఫ్‌ల మహారాజు’ అనగలరు. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించగలరు. మన దేశం ఎంతో సంయమనం పాటించబట్టే అయిదో రౌండ్ తర్వాత ఆగిపోయిన చర్చలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. మధ్యలో అనవసరంగా పేచీకి దిగి విపరీతాలకు పోయింది అమెరికాయే!భారత్‌పై అదనపు సుంకాలు విధించటాన్ని సవాల్ చేస్తూ అమెరికా సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణలో భారత్ రష్యా చమురుకొనటాన్ని ట్రంప్ సర్కారు కారణంగా చూపింది. ఇప్పుడు సుంకాలను వెనక్కి తీసుకుంటే ఆ కేసు బలహీనపడుతుంది.
ట్రంప్‌కు దౌత్యపరమైన మర్యాదలు తెలియవు. తన చర్యల వల్ల అవతలి దేశం స్థానికంగా ఎదుర్కొనక తప్పని ఒత్తిళ్లేమిటో అర్థం కావు. అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే సుంకాల్లో 95 శాతం కోత పెట్టడానికి మన ప్రభుత్వం అంగీకరించింది. కానీ 43 శాతం మంది గ్రామీణ ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్న సాగు రంగాన్ని పణంగా పెట్టడానికీ, చిన్న వ్యాపారుల, పాడిపరిశ్రమ రంగ ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలకూ తాము వ్యతిరేకమని మన ప్రభుత్వం కుండబద్దలు కొడుతోంది. జన్యుపరంగా మార్పిడి చేసిన మొక్కజొన్న మాకొద్దని చెబుతోంది. ఈ విషయంలో భారత్ మనోభావాలను అర్థం చేసుకోకుండా ఒక ధూర్త వ్యాపారిలా ట్రంప్ ప్రవర్తించారు. ఇప్పుడు తామే వెనక్కి తగ్గక స్థితిని సృష్టించుకున్నారు.
తమ దయా దాక్షిణ్యాలపై ఆధారపడే దక్షిణ కొరియా, జపాన్‌లు సాగిలపడటాన్ని చూసి అందరిపైనా ఆ వ్యూహమే పనికొస్తుందని ట్రంప్ భావించటమే ఇందుకు కారణం. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో చెట్టపట్టాలేసుకున్నారు. ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను నెత్తిన పెట్టుకున్నారు. ఈ పరిణామాలతో భారత్ బెంబేలు పడుతుందని భావించారు.
కానీ షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సమావేశానికి మోదీ చైనా వెళ్లటం, అక్కడి పరిణామాలూ గమనించాక జరగబోయేదేమిటో ఆలస్యంగానైనా గ్రహించక తప్పలేదు. భారత్‌కు తాను తప్ప దిక్కులేదనుకోవటం ఘోర తప్పిదమని గ్రహించారు. పర్యవసానంగానే ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో వ్యాపారం తప్ప మరేం లేదన్న వైఖరిని ట్రంప్ విడనాడితేనే ప్రపంచంతో ఆయనకు సామరస్యం కుదురుతుంది. అలా కానట్టయితే నష్టపోయేది అమెరికాయే!