
నికర లాభం రూ. 4,235 కోట్లు
ఆదాయం రూ. 31,942 కోట్లు
గైడెన్స్ 4–5 శాతానికి పెంపు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 4,235 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం పుంజుకుని రూ. 31,942 కోట్లను తాకింది. అయితే త్రైమాసికవారీగా(క్యూ1లో రూ. 3,843 కోట్లతో పోలిస్తే) నికర లాభం 10 శాతం ఎగసింది.
పూర్తి ఏడాదికి సరీ్వసుల ఆదాయం 4–5 శాతం స్థాయిలో పురోగమించగలదని కంపెనీ తాజాగా అంచనాల(గైడెన్స్)ను సవరించింది. ఇంతక్రితం 3–5 శాతం ఆదాయ అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉద్యోగులందరికీ వేరియబుల్ పే అమలు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అక్టోబర్ నుంచి ఇంక్రిమెంట్లకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ఈ కాలంలో 3,489 మందికి ఉపాధి కల్పించడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,26,440కు చేరింది. ఫ్రెషర్స్‌తో కలిపి 5,1196 మందిని విధుల్లోకి తీసుకుంది.
షేరుకి రూ. 12 డివిడెండ్
వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున హెచ్‌సీఎల్ టెక్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 17 రికార్డ్ డేట్. క్యూ2లో అడ్వాన్స్‌డ్ ఏఐ ఆదాయం 10 కోట్ల డాలర్లను(రూ. 876 కోట్లు) అధిగమించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయకుమార్ పేర్కొన్నారు. నిర్వహణ లాభ మార్జిన్ 17.5 శాతంగా నమోదైంది. మార్జిన్లు త్రైమాసికవారీగా 1.16 శాతం బలపడగా.. 16 శాతం అధికంగా 2.6 బిలియన్ డాలర్ల(రూ. 22,500 కోట్లు) విలువైన కాంట్రాక్టులు అందుకుంది.
ఎలాంటి భారీ డీల్ లేకుండానే తొలిసారి ఆర్డర్లు 2.5 బిలియన్ డాలర్లను తాకినట్లు విజయకుమార్ పేర్కొన్నారు. హెచ్1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో గ్లోబల్ డెలివరీ మోడల్ 5 ద్వారా వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. గతేడాదితోపోలిస్తే ఈ ఏడాది ఫ్రెషర్స్‌ను అధికంగా తీసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12.9 శాతం నుంచి 12.6 శాతానికి స్వల్పంగా తగ్గింది. కాగా.. ఆదాయంలో 56 శాతం వాటాగల యూఎస్ బిజినెస్ 2.4 శాతం పుంజుకోగా.. యూరప్ 7.6 శాతం బలపడింది.
మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు బీఎస్‌ఈలో రూ. 1,495 వద్ద యథాతథంగా ముగిసింది.