దోస్త్‌ మేరా దోస్త్‌! | PM Narendra Modi Welcomes Trump Comments on India-US Ties | Sakshi
Sakshi News home page

దోస్త్‌ మేరా దోస్త్‌!

Sep 7 2025 5:12 AM | Updated on Sep 7 2025 5:12 AM

PM Narendra Modi Welcomes Trump Comments on India-US Ties

మోదీ, నేను భాయీ భాయీ 

భారత్‌ను మేం చైనాకు కోల్పోలేదు 

ఒక్కరోజుకే ప్లేట్‌ ఫిరాయించిన ట్రంప్‌ 

మోదీ గొప్ప ప్రధాని అంటూ కితాబు 

ఇప్పుడాయన చేస్తున్నదే నచ్చడం లేదు! 

రష్యా, చైనాతో భారత్‌ నెయ్యంపై ఆక్రోశం 

మారిన వైఖరిని అభినందిస్తున్నా: మోదీ 

భారత్‌–అమెరికాలది వ్యూహాత్మక బంధం 

అత్యంత హుందాగా స్పందించిన ప్రధాని

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: నాలుకకు నరం లేదని, తన చిత్తం క్షణక్షణానికీ మారుతూ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు మరోసారి నిరూపించారు. రష్యా, చైనాతో పాటు భారత్‌పైనా ఒంటికాలిపై లేచి ఒక్కరోజైనా గడవకుండానే షరామామూలుగా ప్లేటు ఫిరాయించారు. భారత్‌పైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా ఉన్నట్టుండి ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘భారత్‌తో అమెరికాకు ‘ప్రత్యేక బంధ’ముంది. 

ముఖ్యంగా మోదీ ఓ అద్భుతమైన ప్రధాని. ఓ గొప్ప వ్యక్తి కూడా. ఆయనతో నాకు గొప్ప స్నేహ బంధముంది. అదెప్పటికీ కొనసాగుతుంది కూడా’’ అని శుక్రవారం (అమెరికా కాలమానం ప్ర కారం) వైట్‌హౌస్‌ ఓవల్‌ ఆఫీసులో మీడియా భేటీ సందర్భంగా మీడియా ప్రశ్నలకు బదులుగా చెప్పుకొచ్చారు. మోదీ కూడా అందుకు అత్యంత హుందాగా స్పందించారు. 

‘‘అమెరికా అధ్యక్షుని తాలూకు ఈ మారిన వైఖరిని ఎంతగానో అభినందిస్తున్నా. భారత–అమెరికా భాగస్వామ్యంపై ఆయన సానుకూల వ్యాఖ్యలు, రెండు దేశాల ప్రత్యేక బంధాన్ని అభినందించిన తీరు ప్రశంసనీయం’’ అని పేర్కొన్నారు. ట్రంప్‌ మీడియా భేటీ తర్వాత కొద్ది గంటలకే ఈ మేరకు ఎక్స్‌లో ప్రధాని పోస్టు పెట్టారు. 

భారత్, అమెరికాలది అత్యంత సానుకూల, ప్రగతి శీల, సమగ్ర వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వా మ్యం అంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జూన్‌ 17 నాటి ఫోన్‌ సంభాషణల అనంతరం ట్రంప్, మోదీ పరస్పరం స్పందించడం ఇదే తొలిసారి. ప్రతీకార సుంకాల కారణంగా దిగజారిన ద్వైపాక్షిక బంధాల పునరుద్ధరణకు అమెరికా, భారత్‌ సంసిద్ధతకు ఇది నిదర్శనమని పరిశీలకులు భావిస్తున్నారు. 

నిమిషానికో మాట... 
భారత్, రష్యాలను దుష్ట చైనాకు కోల్పోయామంటూ సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ‘ట్రూత్‌సోషల్‌’లో ట్రంప్‌ ఘాటుగా పోస్టు పెట్టడం తెలిసిందే. ఆ మూడింటి దోస్తీ సుదీర్ఘంగా వర్ధిల్లాలంటూ వ్యంగ్యోక్తులు కూడా విసిరారు. ‘యుద్ధమా, శాంతా అమెరికాయే తేల్చుకోవా’లన్న చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ హెచ్చరికలకు స్పందనగా ట్రంప్‌ పెట్టిన ఆ పోస్టు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. 

ఆయన ఒంటెత్తు పోకడల కారణంగా అమెరికాతో భారత సంబంధాలు గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా దిగజారిపోవడం తెలిసిందే. వాటిని పూర్తిస్థాయిలో చక్కదిద్దేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ ట్రంప్‌ను విలేకరులు ప్రశ్నించారు. అందుకాయన రకరకాలుగా స్పందించారు. ‘‘ఇరుదేశాల సంబంధాల విషయంలో ఆందోళన పడాల్సిందేమీ లేదు. ఏదో, అప్పుడప్పుడూ అలా జరుగుతూ ఉంటుంది’ అంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. 

‘‘మోదీతో నేను చాలా చనువుగా ఉంటా తెలుసా! ఆయన చాలా గొప్ప వ్యక్తి. రెండు నెలల క్రితమే అమెరికాలో పర్యటించారు కదా!’’ అంటూ ప్రధానిపై మరోసారి పొగడ్తలు కురిపించారు. ‘‘ఆ సందర్భంగా మేమిద్దరం కలిసి రోజ్‌ గార్డెన్‌లో వ్యాహ్యాళికి వెళ్లాం. అక్కడి గడ్డి చెప్పలేనంత తడిగా ఉంది. మీడియా కాన్ఫరెన్స్‌కు అస్సలు సరైన ప్రదేశం కాదది. అలాంటి చోట ప్రెస్‌మీట్‌ పెట్టడం నాకదే చివరిసారి’’ అని చెప్పుకున్నారు. 

అంతలోకే, ‘మోదీ ప్రస్తుతం చేస్తున్న పనే నాకస్సలు నచ్చడం లేదు’ అంటూ రష్యా, చైనాలతో భారత మైత్రిపై తన ఆగ్రహాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ‘అయినా సరే, భారత్‌తో అమెరికాకు అత్యంత ప్రత్యేక బంధముంది’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘అంతలోకే, రష్యా నుంచి భారత్‌ అంతంత భారీగా చమురు కొనేస్తుండటం నాకస్సలు నచ్చడం లేదు. ఇది నన్నెంతో నిరాశకు గురి చేస్తోంది’’ అంటూ మళ్లీ అక్కసు వెళ్లగక్కారు.

 ‘‘ఈ విషయం వాళ్లు తెలుసుకోవాలి. అందుకేగా భారత్‌పై అతి భారీగా 50 శాతం సుంకాలు విధించా!’’ అని చెప్పుకొచ్చారు. ఆ వెంటనే మోదీపై మళ్లీ ప్రశంసలు కురిపించారు. భారత్‌ను చైనాకు కోల్పోయామంటూ మీరు చేసిన పోస్టు నిజమేనా అని మీడియా ప్రశ్నించగా, అలా జరిగిందని తాను అనుకోవడం లేదని ట్రంప్‌ చెప్పడం విశేషం!

వాణిజ్య చర్చలు సూపర్‌ 
భారత్‌తో వాణిజ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని మీడియా ప్రశ్నకు బదులుగా ట్రంప్‌ చెప్పారు. ‘‘అన్ని దేశాలతోనూ చర్చలు బాగా జరుగుతున్నాయి. కాకపోతే గూగుల్‌ తదితర అతి పెద్ద అమెరికా టెక్‌ దిగ్గజాల పట్ల యూరోపియన్‌ యూనియన్‌ వైఖరి విషయంలోనే బాగా నిరాశకు లోనయ్యాం’’ అని బదులిచ్చారు.

మళ్లీ నవరో నోటిదురుసు! 
భారత్‌ పట్ల విద్వేషానికి పెట్టింది పేరుగా మారిన ట్రంప్‌ సలహా బృందం సీనియర్‌ సభ్యుడు పీటర్‌ నవరో మరోసారి నోరు పారేసుకున్నారు. రష్యా నుంచి భారత్‌ కొంటున్న చమురు ద్వారా సమకూరుతున్న ఆర్థిక వనరులే ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఆదరువుగా మారాయంటూ మరోసారి ప్రేలాపనలకు దిగారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement