
న్యూఢిల్లీ: 20 ఏళ్లు పైబడిన మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజును కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. తద్వారా ఇటువంటి వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇరవయ్యేళ్లు పైబడిన లైట్ మోటారు వెహికల్(ఎల్‌ఎంవీ)ల రెన్యువల్ ఫీజును ప్రస్తుతమున్న రూ.5 వేల నుంచి రెట్టింపు చేసి రూ.10 వేలకు పెంచింది.
మోటారు సైకిళ్లకైతే ఈ ఫీజును రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు, త్రీ వీలర్స్, నాలుగు చక్రాల వాహనాలకైతే ఇది రూ.3,500 నుంచి రూ.5,000కు పెంచింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుమతి చేసుకున్న టూ–త్రీ వీలర్‌కైతే రెన్యువల్ ఫీజు రూ.20వేలు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాలుండే వాహనాల రెన్యువల్ ఫీజు రూ.80వేలని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ముసాయిదా సవరణను ఫిబ్రవరిలో జారీ చేసిన కేంద్రం, ఈ నెల 21వ తేదీన దీనిని ఆమోదించింది. వాహనాల రిజిస్ట్రేషన్, రెన్యువల్ ఫీజును కేంద్రం చివరిగా 2021 అక్టోబర్‌లో పెంచింది.