
భువనేశ్వర్: ఏం చేసైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి.పెట్టిన పోస్టుకు లైక్స్ లక్షల్లో రావాలి. వీడియోకు మిలియన్ల వ్యూస్ రావాలి. నేటి తరం యువతలో ఈ తపన రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ అత్యుత్సాహంతో, చట్టం, నైతికత, సమాజం పట్ల బాధ్యతను విస్మరించి విస్మరించి ప్రవర్తిస్తున్నారు. ఇలా ప్రవర్తించిన ఓ యూట్యూబర్ జైలు పాలయ్యాడు.
సాంస్కృతికంగా, చారిత్రికంగా, ప్రకృతి సోయగాలతో అలరారుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన రూప్ నాయక్ అనే యూట్యూబర్ ఓ వీడియో కారణంగా జైలు పాలయ్యాడు. మయూర్భంజ్ జిల్లాకు చెందిన రూప్ నాయక్ తన అత్తింటి నుండి తిరిగి వస్తున్నాడు. మార్గం మధ్యలో అతడికి రోడ్డు పక్కన మానిటర్ లిజర్డ్ (Monitor Lizard ఉడుము) దొరికింది. దానిని ఇంటికి తీసుకెళ్లి, మాంసం వండాడు.
అంతేకాదు, ఉడుము మాంసం కూర ఎలా వండాలి? ఎలాంటి దినుసులు వేయాలో మొత్తం సవివరంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే, ఈ వీడియో ఒక్కసారిగా వైరలైంది. వైరలైన వీడియో గురించి అటవీ శాఖకు సమాచారం అందింది.
ఇంకేం జంతు సంరక్షణ యాక్ట్ 1972 కింద అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో తాను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం అతడికి కోర్టు రిమాండ్ విధించింది. కాగా, అటవీ జంతువులను వేటాడటం, చంపడం, లేదా తినడం చట్టపరంగా తీవ్రమైన నేరం. దీనికి జైలు శిక్ష, జరిమానా సైతం చెల్లించాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.