
ప్రణాళికాబద్ధంగా లేని పట్టణీకరణను పరిహసిస్తూ తరచు ప్రకృతి వైపరీత్యాలు విరుచుకు పడుతున్నా పాలకులు మేల్కొనటం లేదనటానికి మళ్లీ నీట మునిగిన ముంబై మహానగరమే సాక్ష్యం. ముంబై దక్షిణ ప్రాంతంలో గురువారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో ఏకధాటిగా 300 మి.మీ., పశ్చిమ శివారు ప్రాంతంలో 200 మి.మీ. వర్షం కురిసిందంటే కుంభవృష్టి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. నిన్నంతా దాదాపు ప్రశాంతంగానే ఉన్నట్టు కనబడిన ఆ మహానగరం, మళ్లీ భారీ వర్షాలుంటాయన్న హెచ్చ రికలతో బెంబేలెత్తుతోంది.
ఏటా వర్షాకాలంలో కనీసం ఒక్కసారైనా వరదలు ముంబైని పలకరించటం ఆనవాయితీ. ఈసారి మే నెలలోనే ఒక రోజు నడుంలోతు వరదల్లో నగరం నానా యాతనలూ పడింది. ఆ నెలలో కొత్తగా ప్రారంభమైన వొర్లి మెట్రో స్టేషన్ భారీ వరదతో వణికిపోయింది. రెండు నెలలు గడిచాయో లేదో మళ్లీ నగరానికి కుంభవృష్టి తప్పలేదు. నిరుడు 21 దఫాలు 100 మి.మీ. వర్షం పడిందని గణాంకాలు చెబుతు న్నాయి. వాతావరణంలో పెనుమార్పులు విపత్తుల తీవ్రతను పెంచాయి. అస్తవ్యస్థ పట్టణీకరణ ఈ సమస్యను వందల రెట్లు పెంచింది.
ఈసారి వర్షాలవల్ల సంపన్నులు, సినీతారలు నివసించే ప్రాంతాలు సైతం వరద నీటన మునిగాయి. ఇటీవలే ఆర్భాటంగా ప్రారంభించిన మోనోరైల్ సైతం భారీ వర్షాలతో విద్యుత్ సరఫరా అందక గంటసేపు నిలిచిపోయింది. చివరకు అద్దాలు బద్దలుకొట్టి వందమంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది.
ముంబై తూర్పు శివారులోని మీథి నది ఆ మహానగరంపై విరుచుకుపడింది. అయిదు రోజులపాటు వరసగా కురిసిన వర్షాలతో ఆ నది కట్టు తెంచుకుని అటువైపుగల రైల్వే ట్రాక్‌లన్నిటినీ ముంచెత్తింది. అరేబియా సముద్రం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా ఉండటంతో దానిలో కలవాల్సిన మీథి వరద నీరు కాస్తా వెనక్కొచ్చి నగరంలోని అనేక ప్రాంతాలను జలమయం చేసింది. హైదరాబాద్ నగరంలో మూసీ మాదిరిగా ముంబైలో మీథి నదిని కూడా మురికిమయం చేశారు. అందులో 70 శాతం మురికినీరు కాగా, 30 శాతం చెత్తాచెదారం, 10 శాతం పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయి.
ప్రకృతి వైపరీత్యా లుగా కనబడు తున్నవన్నీ సారాంశంలో మానవ తప్పిదాల పర్యవసానం. గత యేభైయ్యే ళ్లుగా నగరాన్ని విస్తరించుకుంటూ పోవటమే తప్ప అందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినవారు లేరు. అలాగని మీథి నది ప్రక్షాళనకు ప్రయత్నాలు జరగ లేదని కాదు. 2013–23 మధ్య బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) రూ. 2,000 కోట్లు వ్యయం చేసింది. కానీ చివరకు తాజా వర్షాల ధాటికి మురికి నీటితో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నివాస ప్రాంతాలన్నీ నిండిపోయాయి. 70వ దశకం వరకూ పరిశుభ్రంగా ఉండే ఆ నది మురికి కూపంగా మారిందంటే పాలకులు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం.
భౌగోళికంగా ముంబై తీరం పశ్చిమ కనుమలకు దగ్గరలో ఉంది. వాటివల్ల నైరుతి రుతుపవనాల్లో గాలుల తీవ్రత హెచ్చుగా ఉంటుంది. అందుకే ఏటా భారీవర్షాలు, వరదలు తప్పవు. దేశ ఆర్థిక రాజధానిగా, ఢిల్లీ తర్వాత అత్యధిక జనసాంద్రత గల నగరంగా ముంబై మన దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణప్రదమైనది. దేశ జీడీపీలో ఆ నగరం వాటా దాదాపు 7 శాతం. కానీ వరదలు ముంచుకొచ్చిన ప్రతిసారీ మౌలిక సదుపాయాలు దెబ్బతినటం, ఉత్పాదకత పడకేయటం రివాజైంది. పునర్నిర్మాణానికి ఏటా రూ. 550 కోట్ల వ్యయమవుతోంది.
నిజానికి ఈ సంక్షోభం అక్కడే కాదు... దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పాలకులనూ పునరాలోచనకు పురిగొల్పాలి. నగర నిర్మాణాల్లో ఎలాంటి మెలకువలు తీసుకోవాలో, పెద్ద నగరాల నిర్మాణంపై మోజువల్ల చివరకు జరిగేదేమిటో గ్రహించేలా చేయాలి. కానీ అదెక్కడా కనబడదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి తాజా వర్షాలకు ఎంత దయనీయ స్థితిలో పడిందో కనబడుతూనే ఉంది.
పెద్ద నగరాల నిర్మాణంవల్ల జనసాంద్రత పెరిగి మౌలిక సదుపాయాల కల్పన అసాధ్యమవుతుందనీ, పైగా అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకరించటం వల్ల ఇతర ప్రాంతాలు ఎప్పటికీ ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోతాయనీ నిపుణులు హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తలకెక్కటం లేదు. మన కోసం ప్రకృతి మారదు. మనమే దానికి అనుగుణంగా మారాలన్న స్పృహ పాలకులకు కలగాలి. మళ్లీ మళ్లీ మునుగుతున్న ముంబై మహానగరాన్ని చూసైనా గుణపాఠం నేర్వకపోతే భవిష్యత్తు క్షమించదు.