
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగే అనాధికారిక మూడు వన్డేల సిరీస్‌లో భారత్-ఎ తరపున ఆడేందుకు రోహిత్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
ఈ మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 30 నుంచి ఆక్టోబర్ 5 మధ్య కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. కాగా టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు.
ఈ ఏడాది ఆక్టోబర్‌లో భారత జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఐపీఎల్-2025 తర్వాత క్రికెట్ దూరంగా ఉంటున్న హిట్‌మ్యాన్.. ఆసీస్-ఎతో జరిగే అనాధికారిక సిరీస్‌ను సన్నహాకంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేవ్ స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం.. రోహిత్ ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు తెలుస్తోంది.
కాగా ఆస్ట్రేలియా టూర్ తర్వాత రోహిత్ పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపించాయి. వన్డే ప్రపంచకప్-2027ను దృష్టిలో పెట్టుకుని రోహిత్, కోహ్లి స్దానాల్లో యువ ఆటగాళ్లను సిద్దం చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
అంతేకాకుండా వన్డేల్లో తన స్ధానాన్ని కాపాడుకోవాలంటే విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడమని రోహిత్‌ను సెలక్టర్లు కోరనున్నట్లు సమాచారం. మరి రోహిత్ ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడుతాడో లేదో వేచి చూడాలి. అయితే ఆసియాకప్ ముగిసిన తర్వాత వన్డే జట్టు భవిష్యత్తు గురించి చర్చించడానికి సెలెక్టర్లు ముంబైలో సమావేశం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఒకవేళ రోహిత్ తన కెరీర్‌ను ముగిస్తే భారత వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ చివరగా విజయ్ హాజారే ట్రోఫీ 2018లో ముంబై తరపున ఆడాడు.
చదవండి: Ajinkya Rahane: ఇక గుడ్ బై.. అజింక్య రహానే సంచలన నిర్ణయం