
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఆయన్ని సీఐడీ అదుపులోకి తీసుకుంది. 2023లో లండన్ పర్యటనపై రణిల్ విక్రమ సింఘేను తొలుత విచారించిన సీఐడీ.. అనంతరం అరెస్ట్ చేసింది. ఆయన్ని న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తామని సీఐడీ అధికారులు వెల్లడించారు.
రణిల్ విక్రమ సింఘే అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో తన భార్య ప్రొఫెసర్ మైత్రీ విక్రమసింఘేతో కలిసి యునివర్సిటీ ఆఫ్ వోల్వర్‌హాంప్టన్‌లో జరిగిన కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు లండన్ ప్రయాణించారు. ఈ ప్రయాణాన్ని వ్యక్తిగతంగా పరిగణించాల్సి ఉండగా, ప్రభుత్వ నిధులను ఉపయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనను విచారణ కోసం పిలిచిన సీఐడీ.. అనంతరం అదుపులోకి తీసుకుంది.
తన భార్య ప్రయాణ ఖర్చులు ఆమె స్వయంగా భరించిందని, ప్రభుత్వ నిధులు వినియోగించలేదని రణిల్ విక్రమ సింఘే పేర్కొన్నారు. మరో వైపు, ఆయన ప్రయాణ ఖర్చులు, భద్రతా సిబ్బంది ఖర్చులు ప్రభుత్వ ఖజానా నుండే చెల్లించబడ్డాయని కానీ సీఐడీ చెబుతోంది. 2022లో గోటబయ రాజపక్స రాజీనామా చేసిన తర్వాత విక్రమసింఘే అధ్యక్ష పదవిని చేపట్టారు. 2024లో ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.