
భారత మహిళా క్రికెట్ జట్టు (PC: ICC)
మహిళల వన్డే ప్రపంచకప్-2025 (ICC ODI World Cup) టోర్నమెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక అప్‌డేట్ అందించింది. టోర్నమెంట్ ఓపెనర్‌లో భాగంగా ఆతిథ్య దేశాలు భారత్- శ్రీలంక మధ్య జరిగే తొలి మ్యాచ్ వేదికను మార్చింది.
తొలుత బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఈ వన్డేను నిర్వహించాలని భావించిన ఐసీసీ.. తాజాగా దీనిని గువాహటిలోని బర్సపరా స్టేడియానికి మార్చింది. అదే విధంగా.. ఈ మెగా టోర్నీలో బెంగళూరులో జరగాల్సిన మిగతా మ్యాచ్‌లన్నింటి వేదికను నవీ ముంబైకి తరలించింది.
తొక్కిసలాటలో ప్రాణాలు పోయాయి
ఇటీవల ఐపీఎల్-2025 (IPL)లో విజేతగా నిలిచిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవం తొక్కిసలాటకు దారి తీసి.. పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న విషాదరకర ఘటన విదితమే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యంతో పాటు కర్ణాటక ప్రభుత్వం మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన దర్యాప్తులో తప్పంతా ఆర్సీబీదేనని తేలింది.
నవీ ముంబైలో..
ఇదిలా ఉంటే.. తొక్కిసలాట ఘటన తర్వాత.. చిన్నస్వామి స్టేడియంలో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌లను నవీ ముంబైలో నిర్వహించాలని నిర్ణయించింది.
ఐసీసీ తాజా ప్రకటన ప్రకారం.. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. లీగ్ దశలో మూడు, సెమీ ఫైనల్, ఫైనల్ కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం ప్రకారం.. ఆ దేశ మహిళా జట్టు తటస్థ వేదికైన శ్రీలంకలోని కొలంబోలో మ్యాచ్‌లు ఆడనున్న విషయం తెలిసిందే.
పాక్ జట్టు ఫైనల్ చేరితే?
ఒకవేళ పాక్ జట్టు ఫైనల్ చేరితే మాత్రం నవీ ముంబై గాకుండా.. కొలంబోలో టైటిల్ పోరు జరుగుతుంది. ఇక బెంగళూరులో జరగాల్సిన భారత్ వర్సెస్ శ్రీలంక, ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా, భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లు మాత్రం నవీ ముంబైలో జరగడం ఖరారైంది.
కాగా బెంగళూరు నుంచి వేదికను తరలించాల్సి వస్తే తిరువనంతపురంలో మ్యాచ్‌లు జరుగుతాయని వార్తలు వచ్చాయి. అయితే, నవీ ముంబై తాజాగా ఈ మ్యాచ్‌ల ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. కాగా సెప్టెంబరు 30న భారత్- శ్రీలంక మ్యాచ్‌తో గువాహటి వేదికగా వన్డే ప్రపంచకప్-2025 టోర్నీకి తెరలేవనుంది.
వన్డే వరల్డ్‌కప్-2025లో టీమిండియా షెడ్యూల్ (అప్‌డేటెడ్)
🏏సెప్టెంబరు 30- భారత్ వర్సెస్ శ్రీలంక- గువాహటి
🏏అక్టోబరు 5- భారత్ వర్సెస్ పాకిస్తాన్- కొలంబో
🏏అక్టోబరు 9- భారత్ వర్సెస్ సౌతాఫ్రికా- విశాఖపట్నం
🏏అక్టోబరు 12- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- విశాఖపట్నం
🏏అక్టోబరు 19- భారత్ వర్సెస్ ఇంగ్లండ్- ఇండోర్
🏏అక్టోబరు 23- భారత్ వర్సెస్ న్యూజిలాండ్- నవీ ముంబై
🏏అక్టోబరు 26- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- నవీ ముంబై.
నాకౌట్ స్టేజ్ షెడ్యూల్
🏏అక్టోబరు 29- సెమీ ఫైనల్ 1- కొలంబో/గువాహటి
🏏అక్టోబరు 30- సెమీ ఫైనల్ 2- నవీ ముంబై
🏏నవంబరు 2- ఫైనల్- కొలంబో/నవీ ముంబై
వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీకి భారత మహిళా క్రికెట్ జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, శ్రీచరణి, స్నేహ్ రాణా.
స్టాండ్‌బై: సయాలీ సత్‌ఘరే, తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మిన్ను మణి.
చదవండి: సౌతాఫ్రికా స్టార్ సంచలనం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా చరిత్ర