
జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్లలో జాబితాలు
వ్యక్తిగత లాగిన్ ఐడీల ద్వారా కాల్‌లెటర్లు అందజేత
సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు
ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్, అర్హత ఆధారంగానే..
డీఎస్సీ–2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ–2025 మెరిట్ జాబితాలను శుక్రవారం అర్ధరాత్రి ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర, జోన్, జిల్లా స్థాయిలో అన్ని సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టులను ప్రకటించింది. వీటిని డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (http;//apdrc.apcfrr.in/లోనూ, సంబంధిత జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంచామని డీఎస్సీ–2025 కన్వినర్ ఎంవీ కృష్ణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీ పోస్టులకు సంబంధించి జోన్ ఆఫ్ కన్సిడరేషన్‌లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత డీఎస్సీ లాగిన్ ఐడీల ద్వారా కాల్ లెటర్లు అందిస్తామన్నారు.
అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకుని అందులో సూచనలను అనుసరించాలని ఆయన పేర్కొన్నారు. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన మూడుసెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. అంతకుముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, టైముకి సర్టిఫికెట్ల పరిశీలనకు వ్యక్తిగతంగా హాజరుకావాలి. హాజరుకాని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దుచేస్తారు.
మెరిట్ లిస్టులో తదుపరి ఉన్న అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలకులు పిలుస్తారు. ఇక సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చినంత మాత్రాన అభ్యర్థులు ఎంపిక అయినట్లు కాదని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి స్పష్టంచేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్, అర్హత, సంబంధిత నియమ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని స్పష్టంచేశారు. ఇక రాష్ట్రస్థాయి పోస్టులైన ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు రాష్ట్రస్థాయి, జోనల్ స్థాయిలో ర్యాంకులను ప్రకటించగా.. స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీలకు ఉమ్మడి జిల్లాల వారీగా ర్యాంకులు, స్కోర్‌ను విడుదల చేశారు.
పీజీటీ రాష్ట్ర టాపర్లు వీరే..
ఇంగ్లిష్ : వారణాశి లక్ష్మీ స్వరూప (87 స్కోరు)
హిందీ : రమేష్ రామనుకొలను (93.5 స్కోరు)
సంస్కృతం: తునికిపాటి భాను (94 స్కోరు)
తెలుగు: పట్నాన ధర్మారావు (85.5 స్కోరు )
బయాలజీ (ఇంగ్లిష్ మీడియం): చోడవరం శివకుమార్ (81.5 స్కోరు)
గణితం (ఇంగ్లిష్ మీడియం): సంకరణం విజయ్ (78.5 స్కోరు)
ఫిజిక్స్ (ఇంగ్లిష్ మీడియం): బాలకిశోర్ కురాకుల (74.5 స్కోరు)
సోషల్ స్టడీస్ (ఇంగ్లిష్ మీడియం): నిరోషా కురమాన (85 స్కోరు)
ప్రిన్సిపాల్: చింతల గౌతమ్ (75.5 స్కోరు)
పీఈటీ రాష్ట్ర ర్యాంకర్లు..
అన్నెపు జగదీశ్వరరావు: 90.5 స్కోరు
టీజీటీ ఇంగ్లిష్..
వెలగల రమ్యశ్రీ : 85.43 స్కోరు
టీజీటీ హిందీ..
గొల్లపల్లి పవన్ నారాయణ్ కౌశిక్ శాస్త్రి: 88.53 స్కోరు
టీజీటీ సంస్కృతం..
తునికిపాటి భాను: 93.60 స్కోరు
టీజీటీ తెలుగు..
కల్లె మహేశ్‌బాబు: 85.20 స్కోరు
టీజీటీ మ్యాథ్స్..
సుంకరణం విజయ్: 87.33 స్కోరు
టీజీటీ సైన్స్..
బోకం అనిత: 77.89 స్కోరు
టీజీటీ సోషల్ స్టడీస్..
బొమ్మిడి డిల్లేశ్: 84.20