శునకాలనే దైవంగా ఆరాధించే క్షేత్రం..! ఎక్కడుందంటే.. | Kerala’s Unique Dog Temple: Madappura Muthappan Shrine Where Dogs Are Worshipped | Sakshi
Sakshi News home page

శునకాలనే దైవంగా ఆరాధించే క్షేత్రం..! ఎక్కడుందంటే..

Aug 22 2025 1:00 PM | Updated on Aug 22 2025 1:31 PM

Keralas Parassini Madappura Temple: Where Dogs Are Worshipped

దేశ రాజధాని ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును చాలామంది సమర్థించగా పలు వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ధర్మాసనం పునః పరిశీలించి.. తుది తీర్పును తాజాగా వెల్లడించింది. వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్‌లలో ఉంచరాదని.. కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్‌లో ఉంచాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే విధంగా.. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెడితే కఠిన చర్యలు తప్పవని సుప్రీం కోర్టు హెచ్చరించింది. దేశ రాజధానిలో శునకాల పరిస్థితి ఇలా ఉంటే.. కొన్ని చోట్ల కుక్కలు దాడి చేయడం గానీ, కుక్క గాటుకి గురైన దాఖలు లేని ప్రదేశాలు ఉన్నాయంటే నమ్ముతారా..!. అంతేగాదు అక్కడ శునకాన్ని ఆరాధ్య దైవంగా పూజలు చేస్తారట. ఆ శునక దేవుడిని భక్తులు కొలిచే విధానం నుంచి సమర్పించే నైవేద్యం వరకు ప్రతీది అత్యంత ప్రత్యేకమే. మరి ఆ విశేషాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.

ఆ ప్రదేశమే కేరళలోని పరస్సిని మడప్పుర ఆలయం. కేరళలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ప్రకృతి సహజ సౌందర్యానికి ఆలవాలమైన ఈ కేరళలోని పరస్సిన మడప్పురలో కొలువైన శ్రీ మతుత్తప్పన్‌ ఆలయం కుక్కలకు స్వాగతం పలుకుతుంది. అక్కడ వాటిని దైవంగా పూజిస్తారు భక్తులు. విశ్వాసానికి పేరుగాంచిన శునకమే దైవం, పైగా కోరికలు తీర్చే కల్పవల్లిగా అక్కడ ప్రజలు కొలుస్తుండటం మరింత విశేషం. ఆ శునకాన్ని విష్ణు, శివుడి అంశంగా భావించి కొలుస్తారట కేరళ వాసులు. ఇది కేరళలోని కన్నూర్‌ నుంచి 20 కిలోమీటర్లు దూరంలో ఈ ఆలయం ఉంది. 

పురాణ కథనం ప్రకారం..ముత్తప్పన్‌ అనే పిల్లవాడు నిబంధనలు ధిక్కరించి స్వేచ్ఛయుతంగా జీవించే మనస్తత్వం కలవాడు. అతనికి వేటాడటం, కల్లు తాగడం, పేదలకు సహాయం చేయడం వంటి మంచి సద్గుణాలు కూడా ఉన్నాయి. ఎవ్వరికి తలవంచిన ఆ ముత్తప్పన్‌ వ్యక్తిత్వం కారణంగా అతని కుటుంబం బహిష్కరణకు గురైంది. దాంతో అతడు ఉన్నటుండి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత గ్రామాస్తులు అతడు దైవాంశ సంభూతడని భావించి..అతని గౌరవార్థం ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయం ప్రవేశ ద్వారం వద్ద ఉండే కాంస్య కుక్క విగ్రహాలు తమ ఊరికి రక్షగా అక్కడి ప్రజలు భావిస్తారు. ఆ ఆలయంలో అత్యంత ఆసక్తి రేకెత్తించే అంశం నివేదించే ప్రసాదం.

నాయూట్టు ఆచారం..
కుక్కలకు పెట్టే ఆహారాన్ని కేరళలో నాయూట్టు ఆచారం అంటారు. ఆ ఆలయంలో కుక్కే దైవం కాబట్టి..ఆ స్వామికి ఎండు చేపలు, ఉడికించిన నల్లబీన్స్‌, టీ నేవేద్యంగా సమర్పిస్తారట. ఆ తర్వాత ఆ ఆలయంలో స్వేచ్ఛగా తిరిగే శునకానికి ఆ ప్రసాదం పెట్టాక..భక్తులకు వితరణ చేస్తారట. ఆలయంలో సుందరి అనే శునకం, దాని పిల్లలను ఆలయ సిబ్బంది ఎంతో ప్రేమగా చూసుకుంటారట.

ఆశ్చర్యకరమైన విషయం..
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఇక్కడ కుక్క కాటు లేదా దాడి చేయడం వంటి ఘటనలు జరిగిన దాఖలాలు కూడా లేవట. ఇది అక్కడ భక్తుల నమ్మకానికి నిదర్శనంగా ఉంటుంది.

రెండు రకాల తెయ్యంలు..
తెయ్యం (Theyyam) అనేది కేరళ రాష్ట్రంలోని ఉత్తర మలబార్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఒక ప్రాచీన జానపద నృత్యం.  ఇది దైవాన్ని ప్రసన్నం చేసుకునే నృత్యం. ఇక్కడ “తెయ్యం” అంటే దైవం అని అర్థం. వన్నన్ తెగ సభ్యులు దీన్ని నిర్వహిస్తారు. 

ఇందులో భాగంగా ముత్తప్పన్‌లా వేషాధారణ వేసుకున్న వ్యక్తి కల్లు తాగడం అనే ఆచారం ఉంటుంది. దీని ఉద్దేశ్యం ఆ వ్యక్తిగత స్ప్రుహను మరిచిపోయేలా చేసి, ఆ వ్యక్తిని దైవంలా ప్రవర్తించేలా చేస్తుందట. ఈ తెయ్యంలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొనవచ్చు..ఆ తంతును వీక్షించి ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందచ్చు.

ఆలయ నిర్మాణం 
ఆలయం మూడు అంతస్తుల తెల్లటి నిర్మాణం.  సాంప్రదాయ కేరళ ఆలయ రూపకల్పనకు నిలువెత్తు నిదర్శనం. ఫోటోగ్రఫీకి కూడా అనుమతిస్తారు. అయితే కొన్ని ఆచారాలను చిత్రించడం నిషిద్ధం.

ఆలయ వేళలు: ప్రతిరోజూ ఉదయం 6:30 నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ప్రత్యేక పూజలు కూడా జరిపించుకోవచ్చు.

చేరుకునే మార్గం..
రోడ్డు మార్గం
కన్నూర్, తాలిపరంభ, సమీప పట్టణాల నుంచి సాధారణ బస్సులు మరియు టాక్సీలు ద్వారా చేరుకోవచ్చు.

రైలు ద్వారా
సమీప రైల్వే స్టేషన్లు కన్నూర్, పయ్యనూర్. రెండు స్టేషన్ల నుంచి, స్థానిక బస్సులు, ఆటో-రిక్షాలు అందుబాటులో ఉంటాయి. అయితే మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. కన్నూర్ స్టేషన్ నుంచి దాదాపు 45 నిమిషాలు పడుతుంది.

విమాన మార్గం
కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆలయం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. దిగిన తర్వాత టాక్సీ లేదా బస్సు సాయంతో చేరుకోవచ్చు.  

చివరగా ఎలాగో కేరళ వస్తున్నారు కాబట్టి ఈ ఆలమం సమీపంలో ఉండే ప్రసిద్ధ పరస్సినికాడవు తాలిపరంబాలోని రాజరాజేశ్వర ఆలయం, పయ్యనూర్‌లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సందర్శించేలా టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే కేరళ సహజ అందాలను వీక్షించే అవకాశం దక్కుతుందట.

(చదవండి: మేఘాలయ టూర్‌..! అంబరాన్నంటే అద్భుతం!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement