
మేఘాలయ టూర్ మేఘాల్లో విహరించినట్లే ఉంటుంది. సముద్ర మట్టానికి ఆరువేల ఐదువందల అడుగుల ఎత్తు. ఆకాశపుటంచులను తాకుతున్నట్లు సాగే ప్రయాణాలు. షిల్లాంగ్ బసలతో చిల్ అవుతూ సాగే పర్యటన ఇది.ఈశాన్య సంస్కృతి దర్పణం డాన్‌బాస్కో మ్యూజియం. వాన జల్లులతో పర్యాటకులను పలకరించే చిరపుంజి. జలధారలను కలిపి జడ అల్లినట్లు ఎలిఫెంట్ ఫాల్స్. ప్రకృతి అద్భుతాన్ని ఒట్టేసి చెప్పే మావ్ స్మాయ్ కేవ్స్. గాల్లో ఉన్నట్లు భ్రమ కల్పించే ఉమ్‌న్‌గోట్ పడవ విహారం. నన్ను చూసి నేర్చుకోండి అంటున్న మావ్ లిన్నాంగ్ గ్రామం. చెరగని చరిత్రకు శిలాజ్ఞాపకం నార్తియాంగ్ మోనోలిథ్‌పార్క్. బోనస్‌గా... కామాఖ్య సందర్శనం... బ్రహ్మపుత్ర విహారం. కంచె ఆవల ఉన్న బంగ్లాదేశ్‌లోకి తొంగిచూడవచ్చు కూడా. ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తున్న ఈ టూర్ వీటిని చూపిస్తుంది.
1వ రోజు
గువాహటి రైల్వే స్టేషన్ లేదా ఎయిర్‌పోర్ట్ నుంచి (ఈ ప్యాకేజ్‌లో టూర్ బుక్ చేసుకున్న పర్యాటకులు రైలు, విమాన మార్గాల్లో ఏ మార్గాన గువాహటికి చేరుతున్నారనే వివరాలను నిర్వహకులకు ముందుగా తెలియచేయాలి) రిసీవ్ చేసుకుని హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. హోటల్ గదిలో చెక్ ఇన్ అయిన తర్వాత ఆ రోజు విశ్రాంతిగా గడపడం, రాత్రి భోజనం, బస అక్కడే. ఆసక్తిని బట్టి తమకు తాముగా సాయంత్రం నగర విహారానికి వెళ్లవచ్చు.అసోమ్ నుంచి టూర్ షురూ!
గువాహటిలో పగలు చూడాల్సిన ప్రదేశాల్లో కామాఖ్య ఆలయం, పీకాక్ ఐలాండ్, ఉమానంద ఆలయం, నెహ్రూపార్క్, అస్సాం స్టేట్ జూ, స్టేట్ మ్యూజియం, పోబితోరా వైల్డ్‌లైఫ్ సాంక్చురీ ఉన్నాయి. సాయంత్రం బ్రహ్మపుత్ర రివర్‌ఫ్రంట్ షికార్ బాగుంటుంది. షాపింగ్‌కి ఫ్యానీ బజార్‌కు వెళ్లవచ్చు. రెండవ రోజు టూర్ షెడ్యూల్‌లో కామాఖ్య ఆలయం, ఆరవ రోజు బ్రహ్మపుత్ర నదిలో విహారం ఉన్నాయి. కాబట్టి మొదటి రోజు చేతిలో ఉన్న కొద్ది సమయంలో చూడగలిగినవి, సమీపంలో ఉన్న ప్రదేశాలను ఎంచుకోవాలి.
2వ రోజు
గువాహటి నుంచి షిల్లాంగ్‌కు ప్రయాణం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి కామాఖ్య దర్శనానికి వెళ్లాలి. దర్శనం తర్వాత షిల్లాంగ్‌కు ప్రయాణం. షిల్లాంగ్‌లో హోటల్ చెక్ ఇన్, డాన్ బాస్కో మ్యూజియం వీక్షణం, లేడీ హైదరీపార్క్‌లో విహారం, సాయంత్రం విశ్రాంతి, రాత్రి భోజనం, బస షిల్లాంగ్ హోటల్‌లోనే. ఆసక్తి ఉన్న వాళ్లు సాయంత్రం విశ్రాంతి సమయంలో సొంతంగా నగర పర్యటన చేయవచ్చు.
సాహిత్య కథనం
కామాఖ్య ఆలయం గురించి జనబాహుళ్యంలో అనేక కథనాలు ఉన్నాయి. కామదేవ్ అనే రాజు దీనిని నిర్మించాడని చెబుతారు. అంతకంటే ముందు బిశ్వకర్మ శిల్పచాతుర్యంతో మహాగొప్ప నిర్మాణం చేశాడని పై భాగం విధ్వంసానికి గురైందని చెబుతారు. దేవీ భాగవతం, దేవీ పురాణం, కాళికా పురాణం, యోగిని తంత్ర, హేవజ్ర తంత్ర సాహిత్యాల్లో ఈ ఆలయం ప్రస్తావన ఉంది.
శైవం ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయం ప్రాభవం తగ్గింది. బ్రహ్మపుత్ర లోయలోని రాజ్యాన్ని పాలించిన నరక అనే రాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడనే కథనం కూడా ఉంది. చారిత్రక ఆధారాలు పెద్దగా లేకపోవడంతో సాహిత్యం, వ్యవహారికంలో ఉన్న కథనాలే ఆధారం.
ఏడంతస్థుల మ్యూజియం
షిల్లాంగ్‌లో నెలకొల్పిన మ్యూజియానికి మూలం రోమ్ నగరం. ఇక్కడి ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలతోపాటు వారు అనుసరించే జీవనశైలిలో దాగిన శాస్త్రీయతను అధ్యయనం చేసిన మీదట వాటిని ప్రోది చేస్తూ ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఆలోచన బ్రిటిష్ పాలకులకు వచ్చింది.
ఏడంతస్థుల భారీ నిర్మాణంతో మ్యూజియానికి ఏర్పాట్లు జరిగాయి. అందులో స్థానిక జాతుల భాషల వివరాలతో లైబ్రరీ కూడా ఉంది. ఆదివాసీ జీవితం కళ్లకు కట్టే విధంగా చిత్రాలు, శిల్పాల అమరిక ఉంది. మిషనరీ ఆధ్వర్యంలో నడుస్తున్న చర్చ్ కూడా ఉంది. పదేళ్ల కిందట ఈ మ్యూజియాన్ని ఏడాదికి 70 వేల మంది సందర్శించేవారు. ఆ నంబరు ఏడాదికేడాదికీ పెరుగుతూ ఇప్పుడు లక్ష దాటింది.
3వరోజు
షిల్లాంగ్ నుంచి చిరపుంజికి ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చిరపుంజికి విహారయాత్ర. దారిలో ఎలిఫెంటా ఫాల్స్, ద్వాన్ సైయిమ్ వ్యూ పాయింట్, నోహ్ కలైకాల్ ఫాల్స్, మావ్ స్మాయ్ గుహలు, సెవెన్ సిస్టర్ జలపాతాల విహారం తర్వాత రాత్రికి తిరిగి షిల్లాంగ్ చేరాలి. రాత్రి భోజనం, బస షిల్లాంగ్‌లో.
ఐదు వందల ఏళ్ల వంతెన
చిరపుంజి అనగానే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశంగానే మనకు పరిచితం. కానీ ఈ ప్రదేశం లివింగ్ బ్రిడ్జిలు కూడా ప్రసిద్ధి. అంటే బతికున్న వంతెనలు. చెట్ల వేళ్లతో అల్లిన వంతెనలన్నమాట. చెట్ల నుంచి వేళ్లను వేరు చేయరు, అలాగే సాగదీసి తాడులా అల్లుతారు. ఆ వేరు అలాగే ముందుకు పెరుగుతూ ఉంటుంది. దానిని కూడా అల్లికలో కలుపుతూ ఉంటారు.
ఒక వంతెన ఏర్పడాలంటే పది నుంచి పదిహేనేళ్లు పడుతుంది. ఇలాగ ఐదు వందల ఏళ్ల నాటి వంతెన నేటికీ ఉంది. ఈ వంతెనలు ఒక్కోచోట రెండంతస్థుల వంతెనలు కూడా ఉంటాయి. ఇంతకీ ఇక్కడ ఇంత స్థాయిలో వర్షం కుండపోతగా కురవడానికి కారణం ఏమిటంటే... బంగాళాఖాతం నుంచి ఆవిరైన నీటితో ఏర్పడిన మబ్బులు ప్రయాణించే దారిలో ఎత్తుగా ఉన్న ఖాశి పర్వత శ్రేణులను తాకుతాయి. మబ్బులను గాలి బలంగా తోస్తూ ఉంటుంది. ముందుకు వెళ్లడానికి వీల్లేకుండా పర్వత శ్రేణి అడ్డుకుంటుంది. దాంతో మబ్బులు ఒక్కసారిగా కుండపోతగా కురుస్తాయి.
ఏనుగు జలపాతం
షిల్లాంగ్ నగరం దాటిన తర్వాత పది కిలోమీటర్ల దూరాన ఉందీ జలపాతం. షిల్లాంగ్ వాసులకు వీకెండ్ పిక్‌నిక్‌లాంటిదన్నమాట. ఈ జలపాతం విశాలంగా ఉంటుంది. కర్నాటకలోని హోగెనక్కల్ జలపాతం పాయలు పాయలుగా విడిపోయి ఊరంత విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. మేఘాలయలోని ఈ జల΄ాతం జలధారలన్నీ ఒకే చోట చేరినట్లు ఉంటుంది.
ఒత్తైన జుత్తు వీపంతా పరుచుకున్నట్లు నల్లటి రాళ్ల మీద పరుచుకున్న తెల్లటి జలధారలివి. ఇక్కడ ఒక రాయి ఏనుగు ఆకారంలో ఉండడంతో దీనికి బ్రిటిష్ వాళ్లు ఎలిఫెంట్ ఫాల్స్ అని పేరు పెట్టారు. అంతకంటే ముందు స్థానికు ఖాసీ తెగ వాళ్లు తమ ఖాసీ భాషలో దీనికి పెట్టుకున్న పేరు ‘కా కై్షద్ లాయ్ పతెంగ్ ఖోసియో’.
ఒట్టు బండ
ఖాసీ భాషలో మావ్ స్మాయ్ అంటే ‘ఒట్టు బండ’ అని అర్థం. ఈ గుహలకు పేరు స్థిరపడింది. ఈ గుహలకు వెళ్లాలంటే చిరపుంజి నుంచి అరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఇవి మన కర్నూలులో ఉన్న బెలుం గుహలు, అరకులో ఉన్న బొర్రా గుహల్లాంటి స్టాలక్‌టైట్, స్టాలగ్‌మైట్ గుహలు. అయినప్పటికీ ఇలాంటి ప్రకృతి వింతలను ఎన్నిసార్లయినా చూడాల్సిందే.
4వ రోజు
షిల్లాంగ్ నుంచి డావ్‌కీ కి ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పర్యటన డావ్‌కీ వైపు సాగుతుంది. ఆ తర్వాత మావ్‌లీన్నాంగ్ గ్రామ సందర్శనం. సాయంత్రానికి తిరిగి షిల్లాంగ్‌కి చేరాలి. రాత్రి భోజనం, బస షిల్లాంగ్ హోటల్‌లో.
గాల్లో పడవ
ఇక్కడున్న ఫొటో చూడండి. నీటి మీద ఉండాల్సిన పడవ గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది. గూగుల్‌లో దొరికిన ఈ ఫొటో మీద ముచ్చటపడి పీసీ డెస్క్‌టాప్ పిక్ గా, ఫోన్‌లో స్క్రీన్ పిక్‌గా పెట్టుకుంటుంటాం. ఇది మేఘాలయలోని ఉమ్‌న్‌గోట్ నది. నీటి స్వచ్ఛతకు ప్రత్యక్ష నిదర్శనం ఈ ఫొటో. నీటి అడుగున నేల స్పష్టంగా కనిపిస్తుంటుంది.
ఈ నది డావ్‌కీ పట్టణంలో ఉంది. ఈ పట్టణం మనదేశ సరిహద్దు. పట్టణ శివారులో కంచె ఉంటుంది. కంచె ఆవల బంగ్లాదేశ్. ఇందులో పడవ ప్రయాణం చేసి, రెండంతస్థులుగా ఉన్న వేళ్ల వంతెన మీద నడిచి, ఇండో–బంగ్లా ట్రేడ్ రూట్ చూసి, బోర్డరులో కంచె దగ్గర నిలబడి ఫొటో తీసుకుంటే టూర్‌లో థ్రిల్ సగం సొంతమైనట్లే.
స్వచ్ఛమైన గ్రామం
మావ్ లిన్నాంగ్ గ్రామం మనదేశంలో మాత్రమే కాదు ఆసియా ఖండంలోనే రికార్డు సృష్టించిన గ్రామం. ‘డిస్కవర్ ఇండియా’ మ్యాగజైన్ నిర్వహించిన పోటీలో క్లీనెస్ట్ విలేజ్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ గ్రామంలో తొమ్మిది వందల మంది నివసిస్తున్నారు. 90 శాతం అక్షరాస్యత సాధించిన గ్రామం. వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్లే అందరూ. గ్రామం మొత్తం తిరిగి చూస్తే ఎక్కడా ఒక్క ఆకు నేల మీద కనిపించదు. రోడ్లు అద్దంలా మెరుస్తుంటాయి. ఇది కూడా ఇండో– బంగ్లా సరిహద్దులో ఉన్న గ్రామమే.
5వ రోజు
షిల్లాంగ్ నుంచి జోవాయ్‌కి ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ప్రయాణం జాంతియా హిల్స్ వైపు సాగుతుంది. తడ్లాస్కీన్ సరస్సు, తైరిషి ఫాల్స్, క్రాంగ్సురీ ఫాల్స్, దుర్గా మందిరం, నార్తియాంగ్ మోనోలిథ్ పార్క్ చూసుకుని సాయంత్రం షిల్లాంగ్‌కు తిరుగు ప్రయాణం. రాత్రి భోజనం, బస షిల్లాంగ్‌లోనే.
స్మారక శిలలు
వ్యక్తులు, రాజుల జ్ఞాపకార్థం కానీ గౌరవార్థంగా కానీ సమాధులు నిర్మిస్తారు. స్మారక భవనాలను నిర్మిస్తారు. ఈజిప్టులో పిరమిడ్‌లు నిర్మిస్తారు. మేఘాలయలో కనిపించే మోనోలిథ్, మెగాలిథ్‌లు కూడా ఇలాంటి స్మారకాలే.
జాంతియా రాజ్యాన్ని పాలించిన రాజుల స్మారకంగా ప్రతిష్టించిన ఏకశిల, బృహత్ శిలలివి. వీటిలో రాజులు తమ విజయాలకు చిహ్నంగా ప్రతిష్ఠించిన శిలలు కూడా ఉన్నాయి. మొత్తానికి ప్రతి ఏకశిల, బృహత్ శిల వెనుక ఒక చరిత్ర ఉంటుంది. నార్తియాంగ్ అనే ప్రదేశంలో ఉన్న మోనోలిథ్, మెగాలిథ్‌లు అత్యంత ఎత్తైనవిగా గుర్తింపు పొందాయి.
ముత్యాల జలపాతం
క్రాంగ్‌షురి జలపాతం ఓ అద్భుతం. అద్భుతం అనడం ఎందుకంటే జలపాతపు నీరు మడుగులో కనిపించే టర్కోయిస్ నీలిరంగే ఆ అద్భుతం. నీరు నేలను తాకి తటాకంగా మారినప్పుడు కనిపించే నీలిరంగు ఇక్కడ కనిపించదు. ఏ జలపాతానికైనా జలధారలు ముత్యాల వానను తలపిస్తుంటాయి. నేలను తాకిన తర్వాత తటాకం చిక్కటి నీలవర్ణంలో లేదా ఆకుపచ్చటి రంగులో కనిపిస్తుంది. మేఘాలయలో కొండల నుంచి జాలువారిన నీరు అత్యంత స్వచ్ఛమైనది.
6వ రోజు
షిల్లాంగ్ నుంచి గువాహటికి ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. గువాహటికి చేరే మధ్యలో ఉమియుమ్ లేక్‌లో విహారం. గువాహటికి చేరిన తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్. మధ్యాహ్నం తర్వాత బ్రహ్మపుత్ర నదిలో క్రూయిజ్ విహారం (ఇది ప్యాకేజ్‌లో వర్తించదు). సాయంత్రం గువాహటి లోకల్ మార్కెట్‌లో షాపింగ్. హోటల్ గదికి చేరి రాత్రి భోజనం, బస.
బ్రహ్మపుత్రలో విహారం
బ్రహ్మపుత్ర నదిలో విహరించకుండా మేఘాలయ, అస్సామ్ టూర్ ముగిస్తే ఆ టూర్‌కి దక్కాల్సిన గౌరవం దక్కలేదనే చె΄్పాలి. బ్రహ్మపుత్ర నదికి దానికంటూ ఓ గొప్పదనం ఉంది. ప్రపంచంలోని పెద్ద నదుల్లో ఇదొకటి. హిమాలయ శ్రేణుల్లో టిబెట్ దగ్గర పుట్టి ఇండియాలో విస్తరించి బంగ్లాదేశ్‌కు వెళ్లి అక్కడి నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఇక్కడి సంస్కృతి వీక్షణానికి అన్ని సౌకర్యాలున్న క్రూయిజ్‌లో బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణించడం సులువైన మార్గం. వైవిధ్యమైన బౌద్ధ నిర్మాణాల ఆర్కిటెక్చర్, హిందూ ఆలయాల నిర్మాణశైలి, ఇస్లాం, క్రైస్తవ ప్రార్థనమందిరాలతోపాటు సామాన్యులు నివసించే ఇళ్ల నిర్మాణాలను కూడా ప్రత్యేకంగా పరిశీలించాలి. సంప్రదాయ నిర్మాణాలతోపాటు ఆధునిక నిర్మాణాల్లో కూడా స్థానిక ప్రత్యేకతలు కనిపిస్తాయి.
7వ రోజు
బ్రేక్‌ఫాస్ట్,గది చెక్ అవుట్ తర్వాత పర్యాటకులు తిరుగు ప్రయాణానికి చేసుకున్న ఏర్పాట్ల ప్రకారం నిర్వహకులు రైల్వే స్టేషన్, ఎయిర్΄ోర్టులో డ్రాప్ చేయడంతో పర్యటన పూర్తవుతుంది.
ఇది మేఘాలయ టూర్. ఏడు రోజుల పర్యటన. ప్యాకేజ్ పేరు ‘ఎసెన్స్ ఆఫ్ మేఘాలయ గ్రూప్ ప్యాకేజ్ ఎక్స్ గువాహటి’.
ఈ ప్యాకేజ్‌లో గువాహటి, షిల్లాంగ్, చిరపుంజి, డావ్‌కీ కవర్ అవుతాయి. ఇది వీక్లీ టూర్. శనివారం మొదలై శుక్రవారంతో పూర్తవుతుంది.
ప్యాకేజ్ కోడ్ : https://irctctourism.com/ pacakage_ description? packageCode= EGH05
టికెట్ ధరలిలాగ: సింగిల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 35 వేల రూపాయలవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీలో దాదాపుగా 28 వేలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 26 వేలవుతుంది. ఇది గువాహటి నుంచి మొదలై గువాహటికి చేరడంతో పూర్తవుతుంది.
పర్యాటకులు తాము ఉన్న ప్రదేశం నుంచి గువాహటికి చేరడం, గువాహటి నుంచి తిరిగి తమ ప్రదేశానికి చేరే ప్రయాణ ఖర్చులు ప్యాకేజ్‌లో వర్తించవు.
గమనిక: కామాఖ్య దర్శనం కోసం వీఐపీ పాస్‌లు కావాలనుకునే వాళ్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీఐపీ టికెట్ ధర 501 రూపాయి. లింక్ https://mkdonline.in
– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి
(చదవండి: ‘రాక్‌స్టార్’: 150 ఏళ్ల నాటి పియానోని ప్లే చేసిన సీఎం)