క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు నమోదైంది. రంజీ ట్రోఫీ 2025-26లో మేఘాలయ ఆటగాడు ఆకాశ్ చౌదరి (Akash Choudhary) వరుసగా 8 బంతుల్లో సిక్సర్లు బాదాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఓ ఆటగాడు వరుసగా 8 సిక్సర్లు బాదడం ఇదే మొదటిసారి. గతంలో క్రికెట్ దిగ్గజాలు రవిశాస్త్రి, గ్యారీ సోబర్స్ వరుసగా 6 సిక్సర్లు మాత్రమే బాదగలిగారు.
అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్) ఆకాశ్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆకాశ్ తొలి బంతిని వృధా చేశాడు. ఆతర్వాతి బంతికి సింగిల్ తీశాడు. ఆతర్వాత వరుసగా 8 బంతుల్లో 8 సిక్సర్లు బాదాడు. మొత్తంలో 11 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (Fastest Half Century) రికార్డును కూడా నమోదు చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ 6 వికెట్ల నష్టానికి 628 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అర్పిత్ భటేవారా (207) డబుల్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ కిషన్ లింగ్డో (119), దలాల్ (144) సెంచరీలతో కదంతొక్కారు. ఆఖర్లో ఆకాశ్ చౌదరీ మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి అజేయంగా నిలిచాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్ 73 పరుగులకే కుప్పకూలింది. ఆర్యన్ బోరా 4 వికెట్లు తీసి ఏపీ పతనాన్ని శాసించాడు. అరుణాచల్ ఇన్నింగ్స్‌లో నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ప్రస్తుతం రెండో రోజు చివరి సెషన్ ఆట కొనసాగుతుంది. మేఘాలయ 555 పరుగుల లీడ్‌ను సాధించింది.
చదవండి: టీమిండియాకు మరో షాక్


