జంషెడ్‌పూర్: ఓపెనర్ అభిషేక్ రెడ్డి (348 బంతుల్లో 247; 20 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ డబుల్ సెంచరీతో చెలరేగడంతో ఆంధ్ర జట్టు కొండంత స్కోరు చేసింది. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 128 ఓవర్లలో 567/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
ఓవర్‌నైట్ స్కోరు 224/2తో మంగళవారం మూడో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. అభిషేక్ రెడ్డి సంయమనంతో కూడిన ఇన్నింగ్స్‌తో జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. కరణ్ షిండే (129 బంతుల్లో 94; 7 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
శ్రీకర్ భరత్, షేక్ రషీద్ అర్ధశతకాలు సాధించగా... త్రిపురణ విజయ్ (27), కెప్టెన్ రికీ భుయ్ (18) ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే ఐదో వికెట్‌కు కరణ్ షిండేతో కలిసి అభిõÙక్ రెడ్డి 208 పరుగులు జోడించడంతో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ఆఖర్లో సౌరభ్ కుమార్ (13 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడాడు.
జార్ఖండ్ బౌలర్లలో అనుకూల్ రాయ్, రిషవ్ రాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జార్ఖండ్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది.
శిఖర్ మోహన్ (3), కుమార్ కుషాగ్ర (16) అవుట్ కాగా... శరణ్‌దీప్ సింగ్ (13 బ్యాటింగ్) మానిషి (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్, సౌరభ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు. మంగళవారం ఆట ముగిసే సరికి చేతిలో 8 వికెట్లు ఉన్న జార్ఖండ్ జట్టు... ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 205 పరుగులు వెనుకబడి ఉంది.


