టీమిండియా వైట్ బాల్ స్పెషలిస్ట్ రింకూ సింగ్ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం దిశగా అడుగులు వేస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2025/26 సీజన్‌లో రింకూ అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. తమిళనాడుతో కోయంబత్తూరు వేదికగా జరుగుతున్న ఎలైట్ గ్రూపు-ఎ మ్యాచ్‌లో ఈ యూపీ బ్యాటర్ భారీ శతకంతో చెలరేగాడు.
149 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రింకూ.. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. అప్పటివరకు బంతిని గింగరాలు తిప్పిన తమిళనాడు స్పిన్నర్లు పి. విద్యుత్, కెప్టెన్ సాయి కిషోర్‌లను రింకూ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.
ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. పిచ్ కండీషన్స్ ఆర్ధం చేసుకోవడానికి కాస్త సమయం తీసుకున్న రింకూ సింగ్.. ఆ తర్వాత తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. రింకూ సింగ్ ఓవరాల్‌గా 248 బంతుల్లో 17 ఫోర్లు, 6 సిక్సర్లతో 176 పరుగులు చేసి ఔటయ్యాడు.
లోయార్డర్ బ్యాటర్ శివమ్ మావితో కలిసి 104 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని ఈ కేకేఆర్ బ్యాటర్ నెలకొల్పాడు. ఫలితంగా యూపీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 460 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అంతకుముందు తమిళనాడు మొదటి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు చేసింది. దీంతో యూపీకి కేవలం 5 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌తో మ్యాచ్‌లో కూడా రింకూ(165) శతక్కొట్టాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన సింగ్.. 341 పరుగులు చేశాడు.


