టాప్ ఆర్డర్ బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడటంతో... జార్ఖండ్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ప్రత్యర్ధికి దీటైన జవాబు ఇచ్చింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 224 పరుగులు సాధించింది.
ఓపెనర్ అభిషేక్ రెడ్డి (156 బంతుల్లో 103 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో క్రీజులో ఉండగా... భారత జట్టు మాజీ సభ్యుడు కోన శ్రీకర్ భరత్ (67 బంతుల్లో 51; 8 ఫోర్లు), అండర్–19 ప్రపంచకప్ విజేత టీమిండియా సభ్యుడు షేక్ రషీద్ (117 బంతుల్లో 58; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు నమోదు చేశారు. భరత్‌తో తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించిన అభిషేక్... రషీద్‌తో రెండో వికెట్‌కు 122 పరుగులు జత చేశాడు.
అభిషిక్‌తో కలిసి నైట్‌వాచ్‌మన్ త్రిపురాణ విజయ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆంధ్ర మరో 104 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 259/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జార్ఖండ్ జట్టు 112.3 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్ 67 పరుగులిచ్చి 4 వికెట్లు... సౌరభ్ కుమార్ 77 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు.


