
టీమిండియా జెర్సీలో రింకూ సింగ్ (పాత ఫొటో)
టీమిండియా టీ20 స్పెషలిస్టు రింకూ సింగ్ (Rinku Singh) రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌ను అద్భుతంగా ఆరంభించాడు. ఈ దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ మొదటి మ్యాచ్‌లోనే భారీ శతకంతో మెరిశాడు. తద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తన సగటును 54.68 నుంచి 57.39కి పెంచుకున్నాడు.
దిగ్గజాలను దాటేసి..
తద్వారా యాభై ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్న తర్వాత అత్యుత్తమ సగటు కలిగి ఉన్న ఆటగాడిగా రింకూ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), సబా కరీం, జడేజాతో పాటు టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను అధిగమించాడు. ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యుత్తమ సగటు కలిగి ఉన్న భారత ఆటగాళ్ల జాబితాలో పదో స్థానంలో నిలిచాడు.
ఈ లిస్టులో విజయ్ మర్చంట్ 71.64 సగటుతో 13 వేల పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షంతను సుగ్వేకర్, కేసీ ఇబ్రహీం 60కి పైగా సగటుతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా రంజీ టోర్నీ తాజా సీజన్ బుధవారం మొదలైంది.
ఆంధ్ర క్రికెటర్ల శతకాలు
ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా కాన్పూర్ వేదికగా ఉత్తరప్రదేశ్- ఆంధ్ర జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆంధ్ర తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (142), వన్‌డౌన్ బ్యాటర్ షేక్ రషీద్ (136) భారీ శతకాలతో సత్తా చాటారు.
ఈ క్రమంలో ఆంధ్ర జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 143 ఓవర్లలో 470 పరుగులకు ఆలౌట్ అయింది. యూపీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ నాలుగు వికెట్లు తీయగా.. ఆకిబ్ ఖాన్ రెండు, శివం మావి, శివం శర్మ, కెప్టెన్ కరణ్ శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

రింకూ సింగ్ భారీ శతకం
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన యూపీ శుభారంభమే అందుకుంది. ఓపెనర్లలో అభిషేక్ గోస్వామి (24) నిరాశపరచగా.. మాధవ్ కౌశిక్ (54), వన్‌డౌన్ బ్యాటర్ ఆర్యన్ జుయాల్ (66) అర్ధ శతకాలతో రాణించారు. అయితే, కెప్టెన్ కరణ్ శర్మ (2) విఫలం కాగా.. లోయర్ ఆర్డర్‌లో ప్రియమ్ గార్గ్ (18), ఆరాధ్య యాదవ్ (17) ఇలా వచ్చి అలా వెళ్లారు.
ఇలాంటి దశలో ఐదో నంబర్ బ్యాటర్ రింకూ సింగ్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. మొత్తంగా 273 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 165 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా విప్రజ్ నిగమ్ 42, శివం శర్మ 38, శివం మావి 20 (నాటౌట్) రాణించారు.
యూపీదే పైచేయి
ఫలితంగా 169 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఉత్తరప్రదేశ్ జట్టు 471 పరుగులు సాధించింది. శనివారం ఆఖరి రోజు ఆట కావడంతో ఫలితం తేలకుండానే మ్యాచ్ ముగిసిపోయింది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర కంటే ఒక్క పరుగు ఆధిక్యం సంపాదించిన యూపీ.. మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు.. ఆంధ్రకు ఒక పాయింట్ దక్కింది.
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ముందు రింకూ రెడ్‌బాల్ క్రికెట్‌లో ఈ మేరకు సెంచరీతో సత్తా చాటడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. రింకూకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం.
చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్ గిల్