రోహిత్‌ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్‌ గిల్‌ | Rohit Sharma Removed as ODI Captain; Shubman Gill Reacts to Rift Rumors Before IND vs AUS Series | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్‌ గిల్‌

Oct 18 2025 3:24 PM | Updated on Oct 18 2025 3:46 PM

IND vs AUS: Gill opens up on any Rift between him Rohit Sharma

టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ (Rohit Sharma) విజయశాతం 75. ఆటగాడిగానూ యాభై ఫార్మాట్లో హిట్‌మ్యాన్‌కు తిరుగులేదు. రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన రోహిత్‌.. ఇటీవలే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy 2025) గెలిచాడు. రానున్న వన్డే వరల్డ్‌కప్‌లోనూ అతడే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని అంతా అనుకున్నారు.

పది కిలోల బరువు తగ్గి 
అందుకు అనుగుణంగానే ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్‌.. ఇటీవలే టెస్టులకూ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. తద్వారా తన దృష్టి మొత్తం వన్డేలపైనే ఉంటుందని చెప్పకనే చెప్పాడు. అంతేకాదు.. 38 ఏళ్ల రోహిత్‌ ఇటీవలే పది కిలోల బరువు కూడా తగ్గి మునుపటి కంటే కూడా మరింత ఫిట్‌గా తయారయ్యాడు.

అయితే, అనూహ్య రీతిలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) రోహిత్‌ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతడి స్థాయంలో యువ ఆటగాడు, టెస్టు సారథి అయిన శుబ్‌మన్‌ గిల్‌కే వన్డే జట్టు బాధ్యతలూ అప్పగించింది. వన్డే వరల్డ్‌కప్‌-2027ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్న ట్లు బోర్డు తెలిపింది. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌తో పాటు గిల్‌తోనూ రోహిత్‌కు విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరిగింది.

రెండింటికీ చాలా తేడా ఉంటుంది
ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆరంభానికి ముందు శనివారం మీడియాతో మాట్లాడిన గిల్‌.. ఈ విషయంపై స్పందించాడు. ‘‘బయట మా గురించి జరుగుతున్న ప్రచారానికి, అంతర్గత విషయాలకు చాలా తేడా ఉంటుంది. మా మధ్య ఉన్న బంధాన్ని ఎవరూ చెరిపివేయలేరు.

ఇంతకు ముందు మేమెలా కలిసి ఉన్నామో.. ఇప్పుడూ అలాగే ఉన్నాము. అతడు పూర్తి సహాయసహకారాలు అందించే వ్యక్తి. ఇన్నేళ్ల అనుభవం కారణంగా.. నేనేదైనా తప్పు చేసినట్లు భావిస్తే.. నా తప్పులను సరిదిద్దుతాడు. ఒకవేళ నాకు ఆయన సలహాలు అవసరమని భావిస్తే.. తప్పక అడుగుతా.

అంతిమ నిర్ణయం నాదే
ప్రతి ఒక్కరి ఆలోచనలను నేను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తా. అలాగే మ్యాచ్‌ విషయంలో పరిస్థితులకు అనుగుణంగా నేనే అంతిమ నిర్ణయం తీసుకుంటా. రోహిత్‌ భాయ్‌, విరాట్‌ భాయ్‌తో నాకు మంచి రిలేషన్‌ ఉంది.

నాకు ఏవైనా సందేహాలు వస్తే.. వారి సలహాలు తీసుకుంటా. నాకు సహాయం చేసేందుకు వాళ్లు కూడా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు’’ అని శుబ్‌మన్‌ గిల్‌ తెలిపాడు. తద్వారా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. కాగా రోహిత్‌ పాటు టీ20, టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన కోహ్లి వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

చదవండి: IND vs AUS: జట్లు, షెడ్యూల్‌, వేదికలు, టైమింగ్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement