గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు శనివారం(నవంబర్ 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే తొలి టెస్టులో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ చేధించలేకపోయింది.
బంతి గింగరాలు తిరిగిన పిచ్‌పై భారత బ్యాటర్లు తడబడ్డారు. సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా ఈ పిచ్‌పై మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అస్సలు అది టెస్టు క్రికెట్ సరిపోయే పిచ్ కాదని చాలా మంది మాజీలు మండిపడ్డారు.
కాగా పిచ్‌పై తీవ్ర విమర్శలు వచ్చినా, తాము కోరుకున్నది ఇదేనని హెడ్ కోచ్ గంభీర్ పేర్కొనడం గమనార్హం. బ్యాటింగ్‌కు పిచ్ మరి అంత కష్టంగా లేదని, సరైన డిఫెన్స్ టెక్నిక్ ఉంటే పరుగులు సాధించవచ్చు అని గంభీర్ చెప్పుకొచ్చాడు. గంభీర్ వ్యాఖ్యలపై కూడా కృష్ణమాచారి శ్రీకాంత్ లాంటి మాజీలు ఫైరయ్యారు. ఇప్పటివరకు ఇటువంటి పిచ్‌ను చూడలేదని అతడు అన్నాడు.
ఈ నేపథ్యంలో గంభీర్‌కు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. పిచ్ క్యూరేటర్ల పనిలో గంభీర్ జోక్యం చేసుకోకుండా ఉండాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
"ఐపీఎల్‌లో గంభీర్‌కు ప్లేయర్‌గా, హెడ్‌కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. అక్కడ పిచ్‌ల ఎంపిక విషయంలో ఏం జరుగుతుందో అతడికి తెలుసు. ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా క్యూరేటర్‌ను ఫలానా పిచ్ కావాలని అడగదు. క్యూరేటర్ స్వతంత్రంగా పిచ్‌ను తయారుచేస్తాడు.
పిచ్ తయారీని క్యూరేటర్‌కే వదిలేయాలి. అతడి పనిలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. ఎలా తాయారు చేయాలో అతడికి బాగా తెలుసు. మీరు మధ్యలో వెళ్లి పిచ్‌లో మార్పులు చేయమని, 'ర్యాంక్-టర్నర్' కావాలని ఆదేశాలు ఇస్తే మొదటికే మోసం వచ్చే అవకాశముంది" అని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నారు.
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! స్టార్ ప్లేయర్‌కు మళ్లీ పిలుపు


