సమర్థ నాయకుడిగా ఎదిగిన దక్షిణాఫ్రికా కెప్టెన్
బ్యాటర్‌గా, సారథిగా అద్భుత ఫలితాలు
సరిగ్గా పదేళ్ల క్రితం తెంబా బవుమా భారత గడ్డపై తన తొలి టెస్టు మ్యాచ్ ఓపెనర్‌గా ఆడి విఫలమయ్యాడు. మరో నాలుగేళ్ల తర్వాత కూడా ఇక్కడ మూడు టెస్టులు ఆడిన అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేకుండా రెండు డకౌట్‌లు సహా మొత్తం 96 పరుగులకే పరిమితమయ్యాడు.
ఈసారి జట్టులో అందరికంటే సీనియర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా మళ్లీ ఈ గడ్డపై అడుగు పెట్టిన అతను తొలి టెస్టునే చిరస్మరణీయం చేసుకున్నాడు. అసాధారణ రీతిలో పోరాడుతూ అజేయ హాఫ్ సెంచరీని నమోదు చేసిన అతను, తన కెప్టెన్సీ వ్యూహాలతో కూడా భారత్ పని పట్టాడు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రత్యరి్థకి తన ఆటతోనే సమాధానమిచ్చాడు. ఇదే జోరును అతను తర్వాతి టెస్టులోనూ కనబరిస్తే సిరీస్ గెలిచే ఘనత కూడా బవుమా ఖాతాలో చేరవచ్చు.
దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్‌కు చేరిన తర్వాత కూడా కెప్టెన్‌గా ఎక్కువ మంది బవుమాను సీరియస్‌గా తీసుకోలేదు. బలమైన ప్రత్యర్థులతో తలపడకుండానే ఫైనల్ చేరిందని జట్టుపై విమర్శలూ వచ్చాయి. అయితే ఆస్ట్రేలియాను చిత్తు చేసి చాంపియన్‌గా నిలవడంతో పాటు ఫైనల్లో చేసిన కీలక అర్ధ సెంచరీ అతడికి కొంత గుర్తింపును ఇచి్చంది. అయినా సరే... విజేతగా అందుకున్న గదతో బవుమా పాల్గొన్న వీడియో షూట్‌పై కూడా వ్యంగ్య వ్యాఖ్యానాలే వినిపించాయి.
అయితే ఇవన్నీ తనకు కొత్త కాదు, వివక్షతో పాటు విసుర్లు కూడా అలవాటే అన్నట్లుగా వాటిని అతను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎప్పుడూ అలాంటి వాటికి సమాధానం కూడా ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఎంతో మందికి సాధ్యం కాని ఘనతను నమోదు చేస్తూ 15 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికాను గెలిపించిన బవుమా... డబ్ల్యూటీసీ విజయం గాలివాటం కాదని నిరూపించాడు. అతని కెప్టెన్సీలో 11 టెస్టులు ఆడిన జట్టు 10 గెలిచి, మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలవడం విశేషం. తన కెప్టెన్సీలో బ్యాటర్‌గా కూడా అతను 57 సగటుతో పరుగులు సాధించాడు.
పట్టుదలకు మారు పేరుగా...
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత బవుమా మరో టెస్టు మ్యాచ్ ఆడలేదు. గాయంతో ఆటకు దూరమైన అతను మెల్లగా కోలుకుంటూ భారత్‌తో టెస్టుల కోసం సిద్ధమయ్యాడు. ఈ సిరీస్‌కు ముందు ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగి తన బ్యాటింగ్‌కు పదును పెట్టుకున్నాడు. కోల్‌కతా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా... రెండో ఇన్నింగ్స్‌లో తన బ్యాటింగ్ విలువను అతను చూపించాడు. ఆట సాగిన కొద్దీ పిచ్ ఆడలేని స్థితికి చేరుతోందని అర్థం కావడంతో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు జోడించేందుకు పట్టుదలగా నిలబడ్డాడు.
అబేధ్యమైన డిఫెన్స్‌తో కూడా బవుమా ఆకట్టుకున్నాడు. తాను ఆడిన తొలి 23 బంతుల్లో 4 పరుగులే చేసినా... వీటిలో స్పిన్నర్లు వేసిన 17 బంతులను అతను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత తడబాటు లేకుండా ఒక్కో పరుగు జోడిస్తూ పోయాడు. అతను తీసిన 33 సింగిల్స్ చివర్లో కీలకంగా మారాయి. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి రెండు జట్ల నుంచి అర్ధ సెంచరీ చేయడం ఒక్క బవుమాకే సాధ్యమైంది. భారీగా పరుగులు ఇవ్వడం లేదని భావించిన భారత్ బవుమా చేసిన నష్టాన్ని ఊహించలేకపోయింది.
పదునైన వ్యూహంతో...
124 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించకుండా వారి సొంతగడ్డపై నిలువరించడం సాధారణ విషయం కాదు. ఏ జట్టయినా ఆట మొదలు కాకముందే కాడి పడేస్తుంది. కానీ బవుమా సహచరుల్లో ధైర్యం నూరిపోశాడు. ఈ స్కోరు కూడా మనకు సరిపోతుంది అతని వారిలో నమ్మకం పెంచే ప్రయత్నం చేశాడు. తన వ్యూహాలతో భారత బ్యాటర్లకు అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ఆరంభంలోనే యాన్సెన్ రెండు వికెట్లు తీసిన తర్వాత తన స్పిన్నర్లను అతను సమర్థంగా వాడుకున్నాడు. కీలక సమయంలో మార్క్‌రమ్‌ను అనూహ్యంగా బౌలింగ్ దింపి అతను ఫలితం సాధించగలిగాడు.
చక్కగా ఆడుతున్న సుందర్‌ను మార్క్‌రమ్ అవుట్ చేయడంతో సఫారీ విజయానికి దారులు తెరచుకున్నాయి. ఇక లెఫ్ట్ హ్యాండర్ అక్షర్ పటేల్ చెలరేగే అవకాశం ఉందని తెలిసినా లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌తో బౌలింగ్ చేయించి ‘సాహసం’ చేశాడు. ఊహించినట్లే తొలి నాలుగు బంతుల్లో అక్షర్ 2 సిక్స్‌లు, ఫోర్ బాదేయడంతో వ్యూహం బెడిసికొట్టినట్లు అనిపించింది. కానీ అక్షర్ గాల్లోకి లేపిన తర్వాతి బంతిని తానే క్యాచ్ అందుకొని బవుమా విజయనాదం చేశాడు. ఈ వ్యూహంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి.
కొసమెరుపు: సరిగ్గా రెండేళ్ల క్రితం 2023 నవంబర్ 16న ఇదే ఈడెన్ గార్డెన్‌లో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడింది. కెప్టెన్ బవుమా ‘సున్నా’కు అవుటై వేదనతో ని్రష్కమించాడు. ఇప్పుడే అదే తేదీన అదే మైదానంలో బవుమా తాను ఎప్పటికీ మర్చిపోలేని ఘనతను సాధించాడు.
సాక్షి క్రీడా విభాగం


