మరో ఐదు రోజుల్లో (నవంబర్ 14 నుంచి) స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. సౌతాఫ్రికా-ఏతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు.
తొలుత కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant).. ఆతర్వాత ధృవ్ జురెల్ (Dhruv Jurel), తాజాగా మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) గాయపడ్డ ఆటగాళ్ల జాబితాలో చేరారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పంత్ బ్యాటింగ్ చేస్తూ చాలా దెబ్బలు తిన్నాడు. అయినా అతడు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఆట నాలుగో రోజైన ఇవాళ (నవంబర్ 9) మరో వికెట్ కీపర్ బ్యాటర్, రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచూరియన్ ధృవ్ జురెల్ చేతి వేలి గాయానికి గురయ్యాడు. తాజాగా పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా ఫీల్డింగ్ చేస్తూ చేతి వేలికి గాయం చేసుకున్నాడు. నొప్పితో విలవిలలాడిన సిరాజ్ మైదానాన్ని వీడాడు. సిరాజ్ గాయం పెద్దదేమీ కానప్పటికీ.. ముందు జాగ్రత్తగా అతనికి విశ్రాంతి కల్పించారు.
ఇదిలా ఉంటే, భారత్-ఏ, సౌతాఫ్రికా-ఏ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా లక్ష్యానికి మరో 70 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. ఇవాళ ఆట చివరి రోజు. 4:35 నిమిషాల సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 347 పరుగుల వద్ద ఉంది. టెంబా బవుమా (57), కాన్నర్ ఎస్టర్‌హ్యూజన్ (5) క్రీజ్‌లో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 255, రెండో ఇన్నింగ్స్‌లో 382/7 డిక్లేర్ స్కోర్లు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో వికెట్‌కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ సెంచరీలు చేశాడు. సౌతాఫ్రికా తరఫున కెప్టెన్ అకెర్‌మన్ తొలి ఇన్నింగ్స్‌ల్లో (134) శతక్కొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో జోర్డన్ హెర్మన్ (91), సెనోక్వానే (77), జుబేర్ హంజా (77), బవుమా (57 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
చదవండి: లేడీ ధోనికి బంపరాఫర్


