రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో కర్ణాటక జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. చండీగఢ్‌తో మంగళవారం ముగిసిన పోరులో కర్ణాటక ఇన్నింగ్స్, 185 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవర్‌నైట్ స్కోరు 72/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన చండీగఢ్... 63.2 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ మనన్ వోహ్రా (161 బంతుల్లో 106 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా... తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 7 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దక్కించుకున్న కర్ణాటక జట్టు... ప్రత్యరి్థని ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే వైఫల్యం కొనసాగించిన చండీగఢ్ 33.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది.
శివమ్ బాంబ్రీ (43) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మనన్ వోహ్రా (6) సహా మిగిలిన వాళ్లంతా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 3, శిఖర్ శెట్టి 5 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌ను 547/8 వద్ద డిక్లేర్ చేసింది.
డబుల్ సెంచరీతో చెలరేగిన కర్ణాటక బ్యాటర్ రవిచంద్రన్ స్మరణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కర్ణాటక 2 విజయాలు, 3 ‘డ్రా’లతో 21 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది.
షాబాజ్ అహ్మద్ సెంచరీ
ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ (122 బంతుల్లో 101; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అస్సాంతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 109.1 ఓవర్లలో 442 పరుగులకు ఆలౌటైంది. సుమంత గుప్తా (97) మూడు పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నాడు. టీమిండియా ప్లేయర్ మొహమ్మద్ షమీ (14 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం జట్టు... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు చేసింది. షమీ (2/29) వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి అస్సాంను కట్టడి చేశాడు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... చేతిలో 7 వికెట్లు ఉన్న అస్సాం ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరు సమం చేసేందుకే ఇంకా 144 పరుగులు చేయాల్సి ఉంది.
విహారి, విజయ్ విఫలం
రంజీ ట్రోఫీలో త్రిపుర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత ఆటగాళ్లు హనుమ విహారి, విజయ్ శంకర్ మరోసారి విఫలమయ్యారు. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా రైల్వేస్‌తో జరిగిన పోరులో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో విహారి 42 బంతులాడి 6 పరుగులు చేయగా... విజయ్ శంకర్ (11) కూడా ఫ్రభావం చూపలేకపోయాడు. దీంతో త్రిపుర రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా రైల్వేస్ జట్టు ఇన్నింగ్స్ 117 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులే చేయగా... రైల్వేస్ 446/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రాజ్ చౌదరీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
సౌరాష్ట్రతో మ్యాచ్‌లో గోవా పోరాడుతోంది. సౌరాష్ట్ర 585/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... గోవా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.
మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో కేరళ జట్టు 315 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌట్ కాగా... కేరళ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. సచిన్ బేబీ (85 బ్యాటింగ్), బాబా అపరాజిత్ (89 బ్యాటింగ్) అజేయ అర్ధశతకాలతో రాణించారు.
ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా పాండిచ్చేరితో మ్యాచ్‌లో ముంబై జట్టు విజయానికి చేరువైంది. ముంబై 630/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... పాండిచ్చేరి తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది.
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. 570/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన రాజస్తాన్‌కు 274 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా జట్టు విజయానికి 203 పరుగుల దూరంలో ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 169 పరుగులు చేయగా... బరోడా 166 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ 272 పరుగులు చేసి బరోడా ముందు 276 పరుగుల లక్ష్యం నిలిపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బరోడా రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.
తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్ రింకూ సింగ్ (157 బంతుల్లో 98 బ్యాటింగ్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడటంతో ఉత్తర ప్రదేశ్ జట్టు 113 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు జట్టు 455 పరుగులకు ఆలౌట్ కాగా... ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం 116 పరుగులు వెనుకబడి ఉంది.


