
ఢిల్లీ: మేఘాలయలో రాజా రఘువంశీ హనీమూన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేఘాలయ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 790 పేజీల ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలను వెల్లడించింది. ఈ హత్య కేసులో అతడి భార్య సోనమ్‌ను ప్రధాన నిందితురాలిగా పేర్కొంది.
వివరాల ప్రకారం.. మేఘాలయలో హనీమూన్‌కు తీసుకెళ్లి భర్తను హత్య చేసిన ఘటన ప్రకంపనలు సృష్టించింది. ఈ హత్య కేసులో తాజాగా మేఘాలయ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా రాజా రఘువంశీ హత్య కేసులో మృతుడి భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా సహా ఐదుగురు నిందితులపై పోలీసులు అభియోగాలు మోపారు. కాగా, ప్రస్తుతం ఈ ఐదుగురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో మరిన్ని ఫోరెన్సిక్ రిపోర్టులు అందిన తర్వాత మరో ముగ్గురు సహ నిందితులపై అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు సిట్ బృందం వెల్లడించింది.
ఈ క్రమంలో ఛార్జ్‌షీట్‌లో రాజా భార్య సోనమ్‌ను ప్రధాన నిందితురాలిగా సిట్ పేర్కొంది. హత్య ఘటన తర్వాత సోనమ్ దాక్కున్న భవన యజమానిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన తర్వాత కోర్టు దీనిపై తదుపరి విచారణ జరపనుంది. దీంతో, ఈ కేసులో ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొంది.
జరిగింది ఇదీ..
ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌కు ఈ ఏడాది మే 11న వివాహం జరిగింది. అనంతరం, 20వ తేదీన కొత్త దంపతులు ఇద్దరూ హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వీరు కన్పించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే అదృశ్యమైన 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు.
అనంతరం సోనమ్ కోసం గాలించగా.. ఉన్నట్టుండి జూన్ 7న ఆమె ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన ప్రియుడు రాజ్ కుశ్వాహా, ఇతర నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 11న నిందితులను కోర్టు కస్టడీకి పంపించింది. తన భర్తను తానే హత్య చేయించినట్లు దర్యాప్తులో సోనమ్ అంగీకరించినట్లు సమాచారం.