
కాళి మాత విగ్రహాన్ని పోలీసులు వాహనంలో తరలించిన ఘటన.. పశ్చిమ బెంగాల్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం శాంతిభద్రతలను అదుపు చేసే క్రమంలోనే అలా చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.
సుందర్‌బన్స్ సమీపంలోని కాక్‌ద్వీప్ నియోజకవర్గంలో సూర్యనగర్ గ్రామ పంచాయితీ పరిధిలోని ఓ ఆలయంలో మంగళవారం కాళికా దేవి విగ్రహాం ధ్వంసమైన స్థితిలో కనిపించింది. ఈ విషయం దావానంలా పాకడంతో.. పలువురు నేతలు తమ అనుచరులతో అక్కడికి చేరుకుని గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో..
పోలీసులు తమ వాహనంలో ధ్వంసమైన ఆ విగ్రహాన్ని తరలించి నిమజ్జనం చేశారు. అయితే ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కాళి దేవి విగ్రహాన్ని ఖైదీలను తరలించే వ్యాన్‌లో తీసుకెళ్లడాన్ని బీజేపీ అవమానకరమైన చర్యగా అభివర్ణించింది. గ్రామస్తులను భయపెట్టి ఆలయ గేట్లు మూసివేశారని, ప్రజల నిరసనలకు దిగడంతో తిరిగి తెరిచారని ఆరోపించింది. నిందితులను అరెస్ట్ చేయకుండా హిందూ రక్షకులను అడ్డుకున్నారని విమర్శించింది. మమతా బెనర్జీ ప్రభుత్వం బెంగాల్‌ను మరో బంగ్లాదేశ్‌గా మారుస్తోందంటూ బీజేపీ మండిపడుతోంది. ఈ క్రమంలో పలువురు హిందూ రక్షకులతో కలిసి పలు ఆలయాల్లో బీజేపీ శాంతి పూజలు నిర్వహిస్తోంది. అయితే..
নিচের ভিডিওটা দেখে কেউ বাংলাদেশ বলে ভুল করবেন না, এটা পশ্চিমবঙ্গের বর্তমান অবস্থা। আমি বার বার বলেছি পশ্চিমবঙ্গ কে পশ্চিম বাংলাদেশ বানানোর চক্রান্ত চলছে, হিন্দুরা এখনি না জাগলে সমূহ বিপদ অপেক্ষা করছে আগামী দিনে
গত রাতে কাকদ্বীপ বিধানসভার সূর্যনগর গ্রাম পঞ্চায়েত এলাকার উত্তর… pic.twitter.com/YB8FwtME3C— Suvendu Adhikari (@SuvenduWB) October 22, 2025
ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారని, కొంతమంది దీనిని రాజకీయంగా వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోందని.. నిందితులను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారని తెలిపింది.
విగ్రహం ధ్వంసం కావడం వల్ల దాన్ని ఆలయంలో ఉంచడం అనుచితమని భావించామని, అందుకే నిమజ్జనం చేయాలని నిర్ణయించామని పోలీసులు అంటున్నారు. ‘‘స్థానికులు విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా జాతీయ రహదారిని బ్లాక్ చేశారు. అంబులెన్సులు సహా పలు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. సున్నితమైన అంశం కావడంతో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూడాల్సిన బాధ్యతగా భావించాం. అందుకే మరో దారి లేకనే విగ్రహాన్ని పోలీస్ వాహనంలో తీసుకెళ్లి నిమజ్జనం చేశాం’’ అని వివరణ ఇచ్చారు. అయితే.. తీవ్ర విమర్శలు, అభ్యంతరాల నేపథ్యంలో పోలీస్ శాఖ ధ్వంసమైన విగ్రహ తరలింపు ఘటనపై విచారణకు ఆదేశించింది.
ఇదీ చదవండి: బీహార్ పంచాయితీకి కాంగ్రెస్ పెద్ద!