నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన దళిత యువకుడు, వైఎస్సార్సీపీ యూత్ పట్టణ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వరరావుపై పట్టణ సీఐ గఫూర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధితుడు విడుదల చేసిన వీడియో ప్రకారం.. ఈశ్వరరావు వేధిస్తున్నాడంటూ ఆయన భార్య లక్ష్మి పట్టణ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. విచారణ కోసం ఈశ్వరరావును పిలిపించిన పోలీసులు.. రాత్రంతా స్టేషన్లోనే ఉంచారు. సీఐ గఫూర్ తనపై భౌతిక దాడి చేశారని, దీంతో తనకు వినికిడి సమస్య తలెత్తిందని, దాడితో పాటు జాతి పేరుతో తనను సీఐ తిట్టారని ఆరోపించాడు.
ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై టౌన్ సీఐ గఫూర్‌ను వివరణ కోరగా తాను చేయిచేసుకోలేదని తెలిపారు. ఈశ్వరరావుపై దాడిని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక ఖండించింది. భార్య, భర్తల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప, భౌతికంగా దాడి చేయడాన్ని ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ కన్వీనర్ బూసి వెంకటరావు ఖండించారు. దాడిపై విచారణ జరిపించాలని జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యురాలు విజయ భారతికి ఫిర్యాదు చేసినట్లు వెంకటరావు తెలిపారు.


