
ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌తో భేటీ
ఇండియా కూటమిలో విభేదాలపై చర్చ!
పట్నా: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బిహార్‌లో ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీల మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ రంగంలోకి దిగారు. బుధవారం ఆయన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌తో సమావేశమయ్యారు. కూటమిలోని ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై ప్రతిష్టంభన ఏర్పడిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
లాలూతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఓడించాలంటే ఇండియా కూటమి పార్టీల్లో ఐక్యత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అయితే, ఇండియా కూటమి సీఎం అభ్యరి్థగా ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ను ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ‘నా నుంచి అలాంటి ప్రకటనను మీరు ఎందుకు ఆశిస్తున్నారు?’అని మీడియాను ఎదురు ప్రశ్నించారు.
‘రెండు నెలల క్రితం ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాం«దీ, తేజస్వీ కలిసి రాష్ట్రమంతా పర్యటించడాన్ని మీరంతా చూశారు. అన్ని విషయాలపై తగిన సమయంలో వారే తగిన నిర్ణయం తీసుకుంటారు’అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 143 సీట్లలో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 61 చోట్ల పోటీ పడుతోంది. అయితే, కొన్ని చోట్ల ఈ రెండు పార్టీలు స్నేహపూర్వక పోటీలోనూ ఉన్నాయి. ఆర్జేడీ నేతలు ఇటీవల ‘తేజస్వీ సర్కార్’నినాదం అందుకోవటంతో కాంగ్రెస్ కినుకు వహించినట్లు చెబుతున్నారు.