బీహార్‌లో నువ్వా-నేనా?? పీపుల్‌ పల్స్‌ ఏమో ఇలా.. | Bihar Assembly Election 2025: Peoples Pulse South First Mood Survey Details | Sakshi
Sakshi News home page

బీహార్‌లో నువ్వా-నేనా?? పీపుల్‌ పల్స్‌ ఏమో ఇలా..

Sep 19 2025 11:08 AM | Updated on Sep 19 2025 11:15 AM

Bihar Assembly Election 2025: Peoples Pulse South First Mood Survey Details

జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది.  దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్గా ఉండే బీహార్లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. 

2025 అక్టోబర్/నవంబర్‌లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 41 నుండి 44 శాతం, ‘ఇండియా’ కూటమికి 40 నుండి 42.5 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడ్ సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 30 నుండి 31 శాతం ఓట్లతో, బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ వారి కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.  రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఉండబోతున్న బీహార్ ఎన్నికల్లో.. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) 6 నుండి 8 శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇతరులు 7.5 నుండి 9 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఈ గణాంకాల్లో 3 శాతం ప్లస్/మైనస్ ఉండే అవకాశాలున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్‌లో స్థానిక సమస్యలు, సంక్షేమ హామీలు, పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. 

పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ-సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడ్ సర్వే నిర్వహించగా  ప్రస్తుతం  ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై స్వలంగా కేవలం ఒక్క శాతం ఓట్ల ఆధిపత్యం కనబరుస్తుందని వెల్లడయ్యింది. ఎన్నికల సమయానికి ఫలితం ఎటైనా మారవచ్చు.

బీహార్‌లో 2020 శాసనసభ ఎన్నికల్లోనూ ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు పోటాపోటీగా తలపడి చెరో 37 శాతం ఓట్లు సాధించాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం  సుమారు 11 వేలు మాత్రమే. ఆర్జేడీ 75 స్థానాలతో మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ 74 స్థానాలతో ఒక్క సీటు తేడాతో రెండో స్థానంలో నిలిచింది. 

సంక్లిష్ట రాజకీయాలకు నెలవైన బీహార్ లో గతంలో వలే మరోసారి ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. బీజేపీ, జేడీ (యూ), హెచ్ఏఎమ్, ఎల్జేపి (ఆర్వీ), ఆర్ఎల్ఎమ్ పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే కూటమి రాష్ట్రంలోని అగ్రవర్ణాలు, ఈబీసీ, దళిత వర్గాల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిగా చెలామణి అవుతూ బీహార్లో మహాఘట్ బంధన్ పేరుతో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, వికశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) పార్టీలతో కూడిన ‘ఇండియా’  (మహాఘట్ బంధన్) కూటమి రాష్ట్రంలోని యాదవ, ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది. వీరితో పాటు ఓబీసీ వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది.  

గతంలో ‘మార్పు’ (2005), ‘సుశాసన్’ (2010),ఉద్యోగాలు (2020) నినాదాలతో రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా, ఈ సారి ఎలాంటి ప్రత్యేక నినాదం లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమ పథకాలు, కుల సమీకరణాలతో పాటు నూతన పార్టీ జేఎస్పీ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి.  

రాష్ట్రంలో ధరల పెరుగుదల, వలసలు, నిరుద్యోగం అంశాలపై ఉన్న వ్యతిరేకతను సంక్షేమం, అభివృద్ధి అంశాలు తగ్గించడం ఎన్డీయేకు కలిసివస్తోంది. ‘జీవికా’ పథకంలో భాగస్వాములైన మహిళలు మద్యనిషేధం, విడో పింఛన్లు, సబ్సీడీలతో నితీశ్ కుమార్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆశించిన ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్నా గత ‘జంగిల్ రాజ్’ కంటే నితీశ్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని అంగీకరిస్తున్నారు. రైతులు కులాల ఆధారంగా చీలిపోయారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) వంటి జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని మూడ్ సర్వేలో వెల్లడైంది. 

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రధానంగా స్థానిక అంశాలకే పెద్దపీట దక్కనుంది. తమ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు స్థానిక సమస్యల ఆధారంగానే ఓటు వేస్తామని చాలా మంది మూడ్ సర్వేలో చెప్పారు. బీహార్ ఎన్నికల్లో ఎప్పటిలా ఈ సారి కూడా సామాజిక కులాలే కీలకం కానున్నాయి. రెండు ప్రధాన కూటముల్లో పార్టీల మధ్య  సీట్ల కేటాయింపులు, పార్టీల అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత ఉండనుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాతే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తామని ఓటర్లు చెప్పారు. ఎన్డీయేకు మద్దతుగా ఉన్న ఈబీసీ ఓటర్లు తమ సామాజిక వర్గం వారికి మహాఘట్ బంధన్ టికెట్లిస్తే వారికి ఓటు వేయడానికి వెనుకాడమని చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో అఖిలేశ్ యాదవ్ పీడీఏ (పిచ్చడ్, దళిత్, అల్పసంఖ్యాక్) వ్యూహం విజయవంతమైనా, బీహార్లో తేజస్వీ యాదవ్ ఎమ్-వై (ముస్లిం, యాదవ్) వ్యూహం విఫలమైంది. టికెట్ల కేటాయింపులో కీలకమైన సామాజిక సమీకరణలను విజయవంతంగా నిర్వహించలేకపోతే పార్టీల్లో అసంతృప్తి పెరిగే అవకాశాలున్నాయి. 

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’ ప్రజాకర్షణగా నిలిచింది. అయితే  ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రెండు కూటములకు మద్దతిచ్చే సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పు కనిపించలేదు.  

సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 15.5 శాతం ఉన్న అగ్రవర్ణాల్లో 3 శాతం బ్రాహ్మణులు, 3.4 శాతం రాజ్పుత్లు, 2.8 శాతం భూమిహార్లు, 0.6 శాతం కాయస్తులు బీజేపీకి మద్దతిస్తున్నారు. బీహార్ లో 14.2 శాతం ఉన్న యాదవ్‌లు ఆర్జేడీ వెంట ఉన్నా మతం ఆధారంగా మిథిలా, సీమంచల్ లో బీజేపీకి కొంత యాదవ్‌ల మద్దతు లభిస్తోంది.  2.8 శాతం ఉన్న కుర్మీలు, 4.2 శాతం ఉన్న కుష్వాహాలు దక్షిణాన నితీశ్ వెంట ఉన్నా, ఉత్తరాదిన చీలిక కనిపిస్తోంది. రాష్ట్రంలో కీలకమైన 36 శాతం ఉన్న ఈబీసీలు జేడీ(యూ), బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. వీరిలో నిశాద్ సామాజికవర్గం ఉప కులాలు ప్రాంతాలవారీగా ఎన్డీయే, వీఐపీ వైపు ఉన్నారు. 19.65 శాతం ఉన్న షెడ్యుల్ కులాలు, 5 శాతం ఉన్న చమార్లు ఆర్జేడీ,కాంగ్రెస్,వామపక్షాల వైపు, 5 శాతమున్న పాశ్వాన్ లు ఎల్జీపీ (ఆర్వీ) వైపు ఉండగా 3 శాతం ఉన్న ముషార్లు ప్రాంతాల వారీగా చీలిపోయారు. 1.68 శాతం ఉన్న షెడ్యూల్ తెగల ఓట్లు రెండు కూటముల మధ్య చీలిపోతున్నాయి. బీహార్ లో 17.7 శాతం ఉన్న ముస్లింలు మహాఘట్ బంధన్ కు పటిష్టమైన ఓటు బ్యాంకుగా నిలుస్తున్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. సీమాంచల్ ప్రాంతంలో ఏఐఎంఐఎం పార్టీకి కొంత ముస్లింల మద్దతు లభిస్తోంది. 

బీహార్‌లో ఏఐఎంఐఎం కీలక పాత్ర పోషిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు స్థానాల్లో గెలిచినా కిషన్గంజ్ లోక్ సభ నియోజవర్గంతో పాటు సమీపంలో ఉన్న అరారియాకే పరిమితమైంది.  గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు ఆర్జేడీలో చేరడంతో ఏఐఎంఐఎం బలహీనపడింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లుపై ఆ పార్టీ ఉద్యమంతో ఆ పార్టీ కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించింది. వక్ఫ్ చట్టంపై ఓవైసీ  పోరాడుతున్నారనే అభిప్రాయం సీమంచల్ లో ముస్లిం యువత భావిస్తోంది. అయితే రాహుల్ గాంధీ యాత్రతో ఏఐఎంఐఎంకు ముస్లింలలో మద్దతు తగ్గుతోందని సర్వేలో తేలింది. ‘ఇండియా’ గ్రూపులో చేర్చుకోవాలని ఏఐఎంఐఎం కోరుతున్నా కాంగ్రెస్, ఆర్జేడీ నుండి ఆశించన స్పందన రాలేదు. కిషన్‌గంజ్‌తో పాటు పూర్ణియా, అరారియా వంటి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో మద్దతు లభిస్తుండడంతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసినా ఏఐఎంఐఎం 1 నుండి 3 స్థానాల్లో గెలవవచ్చని మూడ్ సర్వేలో తేలింది.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి. ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు బీహార్‌లో పోటాపోటీగా హామీలిస్తున్నాయి. నితీశ్ ప్రభుత్వం 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో గ్రామీణ ప్రాతాల్లో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.200 నుండి 300 మేర విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. మహిళల కోసం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన’ పథకం కింద రూ.10 వేలు ఉపాధి ప్రోత్సాహకం, మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రూ.2 లక్షల రుణాలిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ఎన్డీయే మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ట్రైబెల్స్ కు భూమి హక్కులు కల్పిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది.  

ఎన్డీయే హామీలకు పోటీగా మహాఘట్ బంధన్ కూటమి కూడా బీహార్ ప్రజలకు భారీ హామీలిచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రాష్ట్రంలో వలసల నివారణకు స్థానికులకు 100 శాతం ఉద్యోగాలు, ప్రతి పంచాయతీలో ఐటీఐ ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ హామీలిచ్చింది. అన్ని రంగాల్లో మహిళా కోటా కల్పించి, వారికి భద్రత ఇస్తామని మహాఘట్ బంధన్ హామీ ఇచ్చింది. ఈ రెండు కూటములకు పోటీగా జేఎస్పీ పంచాయత్ స్కూల్స్, యువతకు ఉద్యోగాలు, వృద్ధులకు రూ.2000 పింఛన్, మహిళలకు రుణాలు హామీలిస్తూ, రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతోంది. 

శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్ లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ ‘జంగిల్ రాజ్’ వస్తుందని ఎన్డీయే మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా,  నితీశ్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, నేరాలు పెరిగిపోయాయని   మహాఘట్ బంధన్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు. చిన్నపార్టీలైన హెచ్ ఏఎమ్, ఆర్ ఎల్ ఎమ్ ఎన్డీయే కూటమిలో,  వీఐపీ, వామపక్షాలు మహాఘట్ బంధన్ కూటమిలో కీలకపాత్ర పోషించనున్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్, క్షేత్రస్థాయిలో సంస్థగతంగా బలంగా ఉండడం, డిజిటల్ రంగంలో దూసుకుపోవడం అంశాలతో రాష్ట్రంలో బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో పటిష్టంగా కనిపిస్తున్నా, ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిపేరు వినిపించకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుందని క్షేత్రస్థాయిలో పర్యటించిన పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో తేలింది. 30 నుండి 31 శాతం ఓట్లతో బలంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ  యాదవ్ పలు హామీలతో ముందుకెళ్తున్నా అగ్రవర్ణాల్లో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండడం వారికి అడ్డుగా మారుతోంది. కాంగ్రెస్ యాత్రలతో బలపడుతున్నట్టు కనిపిస్తున్నా, ఆ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జేడీ (యు) ఈబీసీ సామాజికవర్గంలో బలంగా ఉండి, మహిళల మద్దతు పొందుతోంది. అయితే 74 ఏండ్ల వయస్సు గల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జేపీ(ఆర్వీ) నేత చిరాగ్ పాశ్వాన్ కు దళిత సామాజిక వర్గంలో మంచి చరిష్మా ఉన్నా, ఎన్డీయేలో చీలిక భయాలున్నాయి. జేఎస్పీ పాదయాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు హామీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ లేకపోవడం బలహీనత.

బహుముఖ పోటీలో కూటముల మధ్య సీట్ల కేటాయింపులు, ఓటర్లను ఆకర్షించడం, చివరి నిమిషం వరకు చేసే ప్రచారంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈబీసీలకు సరైన ప్రాధాన్యతిస్తూ టికెట్లు కేటాయిస్తే ప్రయోజనం ఉండే అవకాశాలున్నాయి. ఎన్డీయేలో బీజేపీ, నితీశ్, చిరాగ్ మధ్య విభేదాలొస్తే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. జేఎస్పీ ఎన్నికల్లో కింగ్మేకర్ పాత్ర పోషించనుంది. మొత్తం మీద బీహార్ ప్రజలు ఓటేస్తుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసమే కాదు. పార్టీలు హామీలిస్తున్న  సంక్షేమాలు  కుల రాజకీయాలను దాటగలవా? యువత ఆశలు విధేయతలను అధిగమించగలదా? ప్రశ్నలకు సమాధానం పోటా పోటీ ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రశాంత కిశోర్ సొంత రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తారో అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 

బీహార్ అసెంబీ ఎన్నికలు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేపుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీల్లో బీహార్ కు చెందిన జేడీ (యు), ఎల్జేపీ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం. బీహార్ లో ఎన్డీయే మెజార్టీ సాధిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకవపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి మెజార్టీ రాకపోయినా లేదా ఏ కూటమిలోనైనా ముఖ్యమంత్రి పీఠంపై చిక్కుముడి పడినా జాతీయ  రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి.    

:::ఆర్‌.దిలీప్‌ రెడ్డి, డైరెక్టర్‌, పీపుల్స్‌ పల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement