
విమర్శల.. ప్రతివిమర్శలతో.. బీహార్ రాజకీయం నెమ్మదిగా వేడెక్కడం మొదలైంది. ఈ క్రమంలో బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత విజయ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను ధృతరాష్ట్రుడితో(Lalu As Dhritarashtra) పోల్చడంపై దుమారం రేగింది.
ధృతరాష్ట్రుడు తన కుమారుడి తప్పులను క్షమించినట్లే, లాలూ ప్రసాద్ కూడా తన కుమారుల తప్పులను సమర్థిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరం అంటూ విజయ్ సిన్హా(Vijay Sinha Slams Lalu) వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన జీవిత చరమాంకంలో ఉన్నప్పటికీ.. తన కుమారుడిపై ఉన్న ప్రేమ వల్ల ధృతరాష్ట్రుడిలా మారిపోయారు. ఆయన రాజకీయాల్లో తన ఉనికిని చాటేందుకు బీహార్‌ను అపహాస్యం చేస్తూ, ఇష్టమైనట్లు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని విజయ్ సిన్హా విమర్శలు గుప్పించారు.

ఈ విమర్శలపై ఆర్జేడీ స్పందించింది(RJD Reacts on Dhritarashtra Comment). విజయ్ సిన్హా వ్యక్తిగత దాడితో దిగజారిపోయారంటూ మండిపడింది. అయితే లాలూను విజయ్ దృతరాష్ట్రుడిగా అభివర్ణించడం ఇదే తొలిసారి కాదు.
బీహార్‌లో విజయం కోరుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ.. పరిశ్రమలను మాత్రం తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు తరలించుకుపోతున్నారంటూ లాలూ ఓ విమర్శ చేశారు. దానికి ఘాటుగా స్పందించే క్రమంలో విజయ్ సిన్హా మాట్లాడుతూ.. బీహార్‌ను నాశనం చేసిన వాళ్లు, ఇక్కడి ప్రజలను ఇతర రాష్ట్రాలకు వలసలు పోయేలా చేసిన వాళ్లు జీవిత చరమాంకంలో ఉన్నారు. అలాంటి వాళ్లు తన కొడుకులపై గుడ్డి ప్రేమతో.. మళ్లీ బీహార్‌లో అలజడిని సృష్టించాలనుకుంటున్నారు. అయితే ఈసారి బీహార్ ప్రజలు అలాంటి చర్యలను సహించబోరు అని విజయ్ సిన్హా అన్నారు.
ఇదీ చదవండి: అతని స్టామినా ఏంటో బీజేపీకి తెలుసు.. అందుకే బుజ్జగింపు!