
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ప్రస్తుతం అన్ని పార్టీలు సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి(Bihar Assembly Election 2025). అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి పక్షాలు తమ భాగస్వామ్య పార్టీలతో పొత్తులను తేల్చుకునే చర్చలను ముమ్మరం చేశాయి. ఎన్డీయే కూటమిలోని బీజేపీ, జేడీయూల మధ్య సీట్ల పంపకాలపై ఇప్పటికే ఓ అవగాహన కుదిరింది. చెరో 100–102 చోట్ల పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. అయితే..
243 స్థానాల్లో 204–205 సీట్లలో ఈ రెండు పార్టీలే పోటీ చేయనుండగా.. మిగతా సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి(NDA Bihar Seat Sharing). బిహార్ ఎన్నికల ఇంఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ఇంఛార్జి వినోద్ తావ్డేలు బుధవారం లోక్‌జనశక్తి పార్టీ(LJP రామ్ విలాస్) నేత, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్(chirag paswan)తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు..
లోక్‌జనశక్తి పార్టీ(LJP)కి 25 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. అయితే.. చిరాగ్ ఆ ఆఫర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్‌జేపీకి 40 స్థానాలు డిమాండ్ చేస్తూ.. ఆయన అంతకు మించి ఒక్క సీటు తగ్గినా ఊరుకునేది లేదని చెప్పినట్లు సమాచారం. తాము కోరినన్ని సీట్లు ఇవ్వకుంటే తమ దారి తాము చూసుకుంటామని ఆయన ఎన్డీయే పెద్దలకు అల్టిమేటం జారీ చేశారని తెలుస్తోంది. అంతేకాదు..
2024 లోక్‌సభ ఎన్నికల్లో 5 సీట్లు గెలిచిన విజయంతో.. తన పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందనే భావనలో చిరాగ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. పైగా బీహార్‌లో గౌరవప్రదమైన సీట్లు.. కేంద్ర కేబినెట్ పదవికి మించినవని భావిస్తున్నారు. ఈ తరుణంలో.. ఎన్డీఏలో ప్రాధాన్యం లేని తరుణంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీతో పొత్తు కోసం చిరాగ్ ప్రయత్నిస్తున్నారన్న కథనాలు.. బీహార్‌లో రాజకీయ కలకలం సృష్టించాయి.
అయితే.. చిరాగ్ పార్టీకి చెందిన ఎంపీ శాంభవి చౌద్రి మాత్రం పరోక్షంగా ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఎన్డీయే కూటమి తిరిగి బీహార్‌లో అధికారంలో చేపడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దీంతో బ్లాక్‌మెయిల్ ద్వారా సీట్లు సాధించుకోవాలని చిరాగ్ చూస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. చిరాగ్ నేతృత్వంలోని LJP (RV)కి బీహార్‌లో దళిత ఓటు బ్యాంక్‌ను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. అంతేకాదు 2020 ఎన్నికల సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీ చేసిన చిరాగ్ ఎల్‌జేపీ.. జేడీయూకి నష్టం కలిగించింది. అంటే.. చిరాగ్ తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఎన్డీయేపై ప్రభావం చూపెడుతుందన్నమాట. దీంతో బీజేపీ ఈ విషయాన్నింటిని పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయనతో చర్చలు జరుపుతోంది.
మిగతా పార్టీలోని జితన్ రామ్ మాంజీ హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం)కు 7, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ)కి 6 సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. అయితే ఆ రెండు పార్టీలు కూడా డబుల్ డిజిట్ సీట్లు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై మరో మూడు, నాలుగు రోజుల పాటు వరుసగా చర్చలు కొనసాగనున్నాయి. మిత్రపక్షాలకు సీట్లు తగ్గితే రాజ్యసభ, శాసనమండలి సీట్ల ఆఫర్లతో వాటిని భర్తీ చేయవచ్చని పార్టీ వర్గాలు సూచిస్తున్నా.. అందుకు వాటిని ఒప్పించడం బీజేపీపై కత్తి మీద సాములాంటిదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇదీ చదవండి: ప్చ్.. నితీశ్‌కు మెట్రో కలిసొచ్చేనా?