అయ్యప్ప సన్నిధిలో ముర్ము | President Droupadi Murmu visited Lord Ayyappa temple | Sakshi
Sakshi News home page

అయ్యప్ప సన్నిధిలో ముర్ము

Oct 23 2025 5:46 AM | Updated on Oct 23 2025 5:46 AM

President Droupadi Murmu visited Lord Ayyappa temple

శబరిమలకు వచ్చిన తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డ్‌

పథనంతిట్ట(కేరళ): కేరళలోని ప్రఖ్యాత శబరిమల గిరిపై కొలువైన అయ్యప్ప స్వామిని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం దర్శించుకున్నారు. పథనంతిట్ట జిల్లా దట్టమైన అభయారణ్యంలో వెలసిన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము కొత్త రికార్డ్‌ సృష్టించారు. గతంలో 1970వ దశకంలో నాటి రాష్ప్రపతి వీవీ గిరి మాత్రమే శబరిమలకు రాష్ట్రపతి హోదాలో వచ్చారు. ఆయన అప్పుడు పల్లకీలో వచ్చారు. ఆ తర్వాత రాష్ట్రపతులెవ్వరూ ఈ ఆలయ దర్శనానికి రాకపోవడం గమనార్హం. 

సంప్రదాయ నలుపు దుస్తుల్లో..
శబరిమల దర్శనం కోసం బుధవారం ఉదయం 7 గంటలకే రాష్ట్రపతి ముర్ము తిరువనంతపురం నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో బయల్దేరి పథనంతిట్ట సమీపంలోని ప్రమదం పట్టణ రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో దిగారు. అక్కడి తన వాహనశ్రేణిలో పంబ నది వద్దకు చేరుకుని నదీజలాల్లో కాళ్లు కడుక్కున్నారు. తర్వాత సమీపంలోని గణపతి ఆలయం సహా పలు ఆలయాలను సందర్శించారు. 

నలుపు రంగు చీరలో వచ్చిన ముర్ముకు కెట్టునీర మండపం వద్ద గణపతి ఆలయ ప్రధాన పూజారి ఇరుముడిని ఆమె తలపై పెట్టారు. తర్వాత అక్కడి రాతిగోడపై ఆమె కొబ్బరికాయలు కొట్టారు. ఇరుముడిని తలపై పెట్టుకుని సన్నిధానంకు బయల్దేరారు. ఇందుకోసం ఆమె 4.5 కిలోమీటర్ల పొడవైన స్వామి అయ్యప్పన్‌ రోడ్డులో ప్రత్యేక వాహనంలో వచ్చారు. రాష్ట్రపతి ముర్ముతోపాటు ఆమె ఎయిర్‌–డీ–క్యాంప్‌(ఏడీసీ) సౌరభ్‌ ఎస్‌ నాయర్, వ్యక్తిగత భద్రతాధికారి వినయ్‌ మాథుర్, ఆమె అల్లుడు గణేష్‌ చంద్ర హోంబ్రమ్‌ సైతం తలపై ఇరుముడి ధరించి రావడం విశేషం.

పూర్ణకుంభంతో సాదర స్వాగతం
సన్నిధానం చేరుకున్నాక నేరుగా ఆమె 18 అత్యంత పవిత్రమైన మెట్ల మీదుగా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు కేరళ దేవాలయ శాఖ మంత్రి వీఎన్‌ వాసవన్, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డ్‌ అధ్యక్షుడు పీఎస్‌ ప్రశాంత్‌ స్వాగతం పలికారు. ఆలయ తంత్రి కందదారు మహేశ్‌ మొహనారు పూర్ణకుంభంతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. తర్వాత ఇరుముడితోనే ఆమె ఆలయ దర్శనం చేసుకున్నారు. గర్భగుడిని సమీపించి ఆలయ ప్రధాన మెట్లపై ఇరుముడిని ఉంచారు. ప్రధాన పూజారి ఆ ఇరుముడిని తీసుకుని పూజ కోసం గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు అయ్యప్పస్వామి జ్ఞాపికను బహూకరించారు. దర్శనం తర్వాత ఆమె సమీపంలోని మాళికాపురం సహా పలు ఉపాలయాలను దర్శించుకున్నారు. తర్వాత దేవస్థానం బోర్డ్‌ వారి గెస్ట్‌హౌస్‌కు తిరుగుపయనమయ్యారు. సాయంత్రంకల్లా తిరిగి తిరువనంతపురం చేరుకున్నారు. గురు వారం రాజ్‌భవన్‌లో ఆమె మాజీ రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ ప్రతిమను ఆవిష్కరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement