
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యేక చొరవ తీసుకుని.. బాధితురాలిని వెతికించి మరీ పరిహారం ఇప్పించిన ఘటన ఇది. రైలు ప్రమాదంలో భర్తను కోల్పోయిన మహిళకు 23 ఏళ్ల తర్వాత పరిహారం అందింది. భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి..
.. విజయ్ సింగ్ అనే వ్యక్తి 2022 మార్చి 21న భాగల్పూర్–దానాపూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తూ కంపార్టుమెంట్ నుంచి హఠాత్తుగా జారిపడ్డారు. తీవ్రంగా గాయపడి మృతిచెందారు. పరిహారం కోసం ఆయన భార్య సంయుక్త దేవి న్యాయ పోరాటం ప్రారంభించారు. ప్రమాదం వెనుక రైల్వేశాఖ నిర్లక్ష్యం లేదని, అతడికి మతిస్థిమితం లేదని, ఎవరో అతడిని నెట్టివేయడం వల్లే రైలు నుంచి కిందపడ్డాడని, పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, పాట్నా హైకోర్టు తేల్చిచెప్పాయి. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కింది కోర్టు ఆదేశాలను 2023లో సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విచారణ కొనసాగించింది. విజయ్ సింగ్‌కు మతిస్థిమితం లేకపోతే రైలు టికెట్ ఎలా కొనుగోలు చేశాడని, రైలు ఎలా ఎక్కాడని? ప్రశ్నించింది. అసంబద్ధమై కారణాలతో పరిహారాన్ని తిరస్కరించడం సరైంది కాదని తేల్చిచెప్పింది. బాధితురాలు సంయుక్త దేవికి రూ.4 లక్షల పరిహారాన్ని ఏటా 6 శాతం వడ్డీతో కలిపి రెండు నెలల్లోగా చెల్లించాలని రైల్వేశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఈ పరిహారం అందజేయడానికి సంయుక్తి దేవి చిరునామా అందుబాటులో లేకుండాపోయింది. ఆమె ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియరాలేదు. జీవనోపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. దాంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. సంయుక్తి దేవి కోసం పబ్లిక్ నోటీసు జారీ చేయాలని, మీడియాలో ప్రకటన ఇవ్వాలని రైల్వే శాఖకు సూచించింది. ఈ ప్రయత్నం ఫలించింది. సంయుక్త దేవి ఆచూకీ లభించింది. పరిహారాన్ని ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు.
‘జూదం’ కేసు విచారణకు సహకరించండి
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ జూదాన్ని, బెట్టింగ్ వేదికలను నిషేధించాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అకౌంటబిలిటీ అండ్ సిస్టమిక్ ఛేంజ్(సీఎఎస్‌సీ) అనే సంస్థ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. సోషల్ గేమ్స్, ఈ–స్పోర్ట్స్ ముసుగులో ఆన్‌లైన్ జూదం కొనసాగుతోందని పిటిషనర్ తరఫు లాయర్ ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ప్రారంభించింది. పిటిషన్‌కు సంబంధించి కాపీని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది వి.సి.భారతికి అందజేయాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు విచారణలో తమకు సహకరించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి స్పష్టంచేసింది.
ఇదీ చదవండి: సీన్‌లోకి సిద్ధూ తనయుడు! డీకే ఏమన్నారంటే..