
న్యూఢిల్లీ: భర్తతో విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్న సమయంలో ‘కస్టడీ డీల్’లో ఉన్న ఐదేళ్ల పిల్లాడితో కనిపించకుండా పోయిన రష్యాకు చెందిన మహిళను వెంటనే వెతికి పట్టుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు. కొన్నేళ్ల క్రితం రష్యాకు చెందిన మహిళ విక్టోరియా బసూను భారత్‌కు చెందిన సైకత్ బసూ వివాహం చేసుకోగా, ప్రస్తుతం వారి మధ్య విడాకుల కేసు ఢిల్లీ సాకేత్ కోర్టులో పెండింగ్‌లో ఉంది.
ఈ సమయంలో విక్టోరియా బసూ కనిపించకుండా పరారైయినట్లు భర్త సైకత్ బసూ ఫిర్యాదు చేశాడు. తన భార్య పిల్లాడిని తీసుకుని పరారైనట్లు సైకత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిలో భాగంగా విచారణ చేపట్టిన ధర్మాసనం సదరు మహిళను వెంటనే పట్టుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
అదే సమయంలో రష్యన్ మహిళ వెంట పెట్టుకుని తీసుకుని పోయిన ఆమె కుమారుడ్ని వెంటనే ట్రేస్ అవుట్ చేయాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. ఇందులో ఎటువంటి జాప్యం లేకుండా త్వరతగతిన పిల్లాడి ఆచూకీని ఛేదించాలని స్పష్టం చేసింది. ఆపై పిల్లాడిని తండ్రి సైకేత్‌కు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం.. పిల్లాడితో పాటు కనిపించకుండా పోయిన విక్టోరియా బసూ పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని ఆదేశించింది. ఎయిర్‌పోర్ట్, నావీ పోర్ట్‌ల్లో అధికారులు ఆ మహిళపై ఓ కన్నేసి ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది ధర్మాసనం. అదే సమయంలో ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
విక్టోరియా బసూ ఎక్కడ ఉందో తెలియదంటూ ఆమె తరఫు న్యాయవాది తెలిపిన క్రమంలో.. సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ‘ ‘ఆమె ఎక్కడ ఉందో మీకు తెలుసు. మీరు మాతో ఆటలు ఆడాలనుకుంటున్నారా?, మీ దగ్గరికి మళ్లీ వస్తాం.. మీరు కాస్త ఆగండి’ అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
ఆమెకు రష్యా ఎంబాసీ అధికారి సాయం చేశారు..
తన భార్య పారిపోవడానికి భారత్‌లో ఉన్న రష్యన్ ఎంబసీ ప్రతినిధి సాయం చేశారని సైకేత్ కోర్టుకు తెలిపారు. విడాకుల కేసు ప్రోసిడింగ్స్‌లో ఉండగా ఢిల్లీలోని రష్యన్ ఎంబసీ నుంచి ఆమె పారిపోయిందని భర్త తెలిపారు. ఎంబసీ వెనుక గేటు నుంచి ఆమె వెళ్లిపోయిందని, రష్యన్ ఎంబసీ అధికారి ఆమెకు సాయం చేశారని భర్త ఆరోపిస్తున్నాడు. లగేజీ పట్టుకుని మరీ వెళ్లిన ఆమెను సదరు అధికారి పంపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. రష్యన్ ఎంబాసీ అధికారి ఆమెకు సాయం చేయడం తాను చూశానన్నాడు.
అ అధికారి ఇళ్లు సోదా చేయడానికి అనుమతి కోరండి
రష్యన్ రాయబార కార్యాలయ అధికారితో సంబంధం ఉందని బాధిత భర్త చేసిన ఆరోపణను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది; ఆమె గుర్తించబడకుండా భవనంలోకి ప్రవేశించడానికి సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఎవరు అనేది అస్పష్టంగా ంది. ఢిల్లీలోని ఈ అధికారి ఇంటిని సోదా చేయడానికి అనుమతి కోరాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు.
విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా ఆ పిల్లాడు మూడు రోజులు తల్లి దగ్గర ఉండాలనేది కస్టడీ డీల్. దీనిలో భాగంగా మే 22వ తేదీన పిల్లాడిని తీసుకుంది. అదే తాను పిల్లాడిని చివరిసారి చూడటమని కోర్టుకు తెలిపాడు భర్త సైకేత్. భార్య విక్టోరియా బసూ.. జూలై 7 నుంచి పిల్లాడితో సహా కనిపించకుండా పోయిందని సైకేత్ బసూ కోర్టుకు తెలిపారు.