
క్రాకర్స్‌పై నిషేధం పాక్షిక ఎత్తివేతకు సుప్రీంకు వెళ్లనున్న బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళికి టపాసుల మోత మోగే అవకాశాలున్నాయి. వాయు కాలుష్యం దృష్ట్యా ఏళ్లుగా కొనసాగుతున్న సంపూర్ణ నిషేధంపై బీజేపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రజల మతపరమైన, సాంస్కృతిక మనోభావాలను గౌరవిస్తూ, పర్యావరణానికి హాని కలగని రీతిలో హరిత (గ్రీన్) టపాసులకు అనుమతి ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు టపాకాయలపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.
గ్రీన్ కాకర్స్‌కే అనుమతి!
సంపూర్ణ నిషేధం బదులుగా, ప్రభుత్వం నిర్దేశించిన, ధ్రువీకరించిన గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే పరిమిత సమయం పాటు కాల్చేందుకు అనుమతించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించనుంది. పండుగ ఉత్సాహాన్ని దెబ్బతీయకుండా, అదే సమయంలో కాలుష్య నియంత్రణకు పెద్దపీట వేసేలా ఈ మధ్యేమార్గం ఉత్తమమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ తమ ప్రథమ ప్రాధాన్యాలని, అందుకే కేవలం తక్కువ ఉద్గారాలు వెలువరించే హరిత టపాసుల వైపే మొగ్గు చూపుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు.
ఫలించని సంపూర్ణ నిషేధం
కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంపూర్ణ నిషేధం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ప్రభుత్వం వాదించనుంది. నిషేధం ఉన్నప్పటికీ, ప్రజలు అక్రమ మార్గాల్లో ప్రమాదకరమైన, అధిక కాలుష్యాన్ని వెదజల్లే టపాసులను కొనుగోలు చేసి కాలుస్తున్నారని, దీనివల్ల కాలుష్య తీవ్రత తగ్గకపోగా కొన్నిసార్లు మరింత పెరుగుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కఠినమైన నిషేధం కంటే నియంత్రిత పద్ధతిలో గ్రీన్ క్రాకర్స్‌ను అనుమతించడమే ఆచరణాత్మక పరిష్కారమని బీజేపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచి్చంది.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి, గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతిస్తే నిబంధనల అమలులో ఏమాత్రం ఉపేక్షించబోమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరం అంతటా పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నారు.