
బీహార్‌లో గ్రాండ్ అలయన్స్(Mahaghat Bandhan) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు అంగీకారం తెలిపింది. సీనియర్ నేత అశోక్ గెహ్లాత్ చొరవతో కూటమి పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపకాలపై ఇప్పటికీ ఓ స్పష్టత కొరవడిన సంగతి తెలిసిందే. లెక్క తేలకపోవడంతో ఎవరికివారే అభ్యర్థులను ప్రకటించుకుని నామినేషన్లు దాఖలు చేయించారు. ఈ క్రమంలో పలు స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. అయితే దీనిని ‘ఫ్రెండ్లీ పోటీ’గా అభివర్ణించుకున్న ఆర్జేడీ-కాంగ్రెస్‌లు.. మరో పక్క ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాత్, మాజీ ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ప్నాట్నాలో నిన్నంతా బిజీబిజీగా గడిపారు. భాగస్వామ్య పార్టీల కీలక నేతలతో సమావేశమై సీటు పంపకాలపై నెలకొన్న సందిగ్ధాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. మొత్తంగా 8 స్థానాల్లో పోటీ స్నేహపూర్వకంగా ఉండాలని నిర్ణయించుకున్నారని, మరీ ముఖ్యంగా తేజస్వి యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ సింగ్ ఇప్పటికే ఈ విషయాన్ని ధృవీకరించారు. CPI (ML) నేత దీపంకర్ భట్టాచార్య త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు.