
పట్నా:బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న విచిత్ర పరిణామాలు మీడియా కంట పడుతున్నాయి. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)కి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రీతూ జైస్వాల్.. ఆర్‌జేడీని వీడి బీహార్‌లోని పరిహార్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
రాష్ట్రీయ జనతాదళ్‌పై తిరుగుబాటు ప్రకటించిన జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ నేతలు తనకు టికెట్ నిరాకరించారని, ఇది ఆర్‌జేడీ నాయకత్వం తనకు తలపెట్టిన ద్రోహంగా ఆమె అభివర్ణించారు. తనను మరో నియోజకవర్గం నుంచి పోటీచేయాలని పార్టీ కోరిందని, అది తన మనస్సాక్షికి వ్యతిరేకమని, అందుకే తాను స్వతంత్రంగా నామినేషన్ వేయాలనుకున్నానని రీతూ జైస్వాల్ తెలిపారు.
1977, మార్చి ఒకటిన హాజీపూర్‌లో జన్మించిన జైస్వాల్, ప్రభుత్వ మాజీ ఉద్యోగి అరుణ్ కుమార్ భార్య. కుమార్ తన గ్రామానికి సేవ చేసేందుకు, విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్)తీసుకున్నారు. అతని భార్య జైస్వాల్ బీహార్ రాజకీయాల్లో ప్రముఖ నాయకురాలిగా పేరు సంపాదించారు. విద్య, మౌలిక సదుపాయాలు ఇతర సమస్యల పరిష్కారానికి ఆమె ప్రభుత్వంతో పోరాడుతుంటారు. రీతూ జైస్వాల్ రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు.
2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఆమె పరిహార్ స్థానం నుండి పోటీ చేశారు. అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గాయత్రి దేవి చేతిలో కేవలం 1,569 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో షియోహార్ నియోజకవర్గం నుండి పోటీ చేసి, ఓటమి చవిచూశారు. నాడు ఆమె జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ)నేత లవ్లీ ఆనంద్ చేతిలో 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఆమెకు ఓటమి ఎదురైనప్పటికీ, క్షేత్రస్థాయిలో భారీ మద్దతు లభించింది.
2020 బీహార్ ఎన్నికల్లో రెండు వేల కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, ఇప్పుడు పార్టీ తనకు టికెట్ నిరాకరించిందని రీతూ జైస్వాల్ ఆరోపించారు. నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో ఆమె ఎంతో భావోద్వేగానికి గురై, తాను రాజకీయ కుట్రకు బలయ్యానని పేర్కొన్నారు. జైస్వాల్‌ను బెల్సాండ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని పార్టీ కోరింది. అయితే ఆమె పరిహార్ నుండి పోటీ చేస్తానని పట్టుబట్టారు.