
న్యూఢిల్లీ: బీహార్‌లో నవంబర్‌లో జరగనున్న ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో రాజకీయపార్టీల్లో సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష కూటమిలో సీట్ల కేటాయింపు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీనిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గురువారం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో నేరుగా మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. పోటీ విషయంలో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరు పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని సమాచారం.
బీహార్ ఎన్నికలకు సంబంధించి మొదటి దశ నామినేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ కీలక మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య ఇంతవరకూ సీట్ల కేటాయింపు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. తొలుత ఆర్జేడీ తన మిత్రపక్షం కాంగ్రెస్‌కు 52 సీట్లు ఇచ్చింది. అయితే దానిని కాంగ్రెస్ తిరస్కరించింది. కనీసం 60 నియోజకవర్గాలు కావాలని పట్టుపట్టింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలు- ఆర్జేడీ మధ్య చర్చలు నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో రెండు పార్టీల జాతీయ నాయకత్వం సీట్ల ప్రతిష్టంభనను తొలగించేందుకు రంగంలోకి దిగింది.
అయితే ఆర్జేడీ నేతలు కాంగ్రెస్ 61 సీట్ల డిమాండ్‌ను నెరవేర్చడానికి ముందుకు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ పట్టుబట్టిన కొన్ని కీలక నియోజకవర్గాలపై విభేదాలు మొదలయ్యాయని సమాచారం. నర్కటియగంజ్, వాసాలిగంజ్, కహల్గావ్ స్థానాలలో పోటీ విషయంలో ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. చైన్పూర్, బచ్వారాలలో ఇదే పరిస్థితి నెలకొన్నదని సమాచారం. కాగా రాహుల్ గాంధీ తాను చేపట్టిన ఓటరు అధికార్ యాత్ర రాష్ట్రంలో తమకు అవకాశాలను పెంచుతుందని నమ్ముతూ మరిన్ని సీట్లు కోరుతున్నారని తెలుస్తోంది.
మీడియాకు ప్రాధమికంగా తెలిసిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 61 సీట్లతో సరిపెట్టుకునేందుకు అంగీకరించింది. ఇది 2020లో పోటీ చేసిన 70 సీట్ల కంటే తొమ్మిది సీట్లు తక్కువ. ఆ సమయంలో కాంగ్రెస్ 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. నాటి ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేయగా, 75 మంది అభ్యర్థులు గెలిచారు. ఇదిలా ఉండగా సీట్ల కేటాయింపు ఇంకా జరగకముందే బుధవారం రాత్రి కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బుధవారం రాఘోపూర్ అసెంబ్లీ స్థానం నుండి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కాంగ్రెస్ తమ అభ్యర్థులను తొలి జాబితాను ప్రకటించడం గమనార్హం.