బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో విభేదాలు కరిగిపోతున్నాయనే సంకేతాలు కనిపించాయి. లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ తాజాగా ఇంటికి రావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్‌లోని మాజీ సీఎం రబ్రీదేవి నివాసానికి మంగళవారం తేజ్ ప్రతాప్ రావడం చర్చనీయాంశమైంది. లాలూ, రబ్రీతో పాటు ఆ సమయంలో అక్కడే ఉన్న తమ్ముడు తేజస్వితో భేటీ అయ్యాడు. ఆపై మకర సంక్రాంతి సందర్భంగా 14న దహీ–చూరా విందుకు కుటుంబ సభ్యులకు ఆహ్వాన పత్రిక అందించాడు.
కాసేపు కుటుంబ సభ్యులతో గడిపిన తేజ్ ప్రతాప్.. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ సమయంలో తేజస్వి కూతురు కాత్యాయనిని ఎత్తుకుని తేజ్ ముద్దాడడం కుటుంబ కలయికకే హైలైట్ అయ్యింది. ఆ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుటుంబ సభ్యులు ఈ విందుకు హాజరవుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.


ఇప్పుడు అందరి దృష్టి తేజ్ ప్రతాప్ నిర్వహిస్తున్న దహీ–చూరా విందుపై ఉంది. ఇది కేవలం సంప్రదాయ విందు కాకుండా.. ఒక పొలిటికల్ ఈవెంట్‌లా.. అన్నింటికీ మించి లాలూ కుటుంబ ఐక్యతను ప్రతిబింబించే సంకేతంగా బీహార్ ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిణామం ఆటోమేటిక్‌గానే ఆర్జేడీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే..
ఈ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తేజ్ ప్రతాప్ యాదవ్ కేవలం లాలూ కుటుంబ సభ్యులకే ఈ విందు ఇవ్వడం లేదు. మొత్తం బీహార్ రాజకీయ పార్టీలు, ప్రముఖులకు ఆయన ఆహ్వానం అందించారు. కుటుంబ సభ్యుల కంటే ముందే.. బీజేపీ ప్రముఖ నేతల ఇళ్లకు వెళ్లి స్వయంగా ఆహ్వానం ఇవ్వడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఆయన బీజేపీ వైపు వెళ్తున్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే బీజేపీతో పాటు ఇతర పార్టీల ప్రముఖులకు కూడా ఆయన ఇన్విటేషన్ ఇచ్చారు. దీంతో అన్నదమ్ములు ఒక్కటవ్వడంపై అనుమానాలు నెలకొన్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. లాలూ ఇద్దరు కొడుకుల మధ్య కోల్డ్‌వార్ జరిగింది. సరిగ్గా అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ పోస్ట్ పెట్టి.. ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు తేజ్ ప్రతాప్. ఆపై సొంత పార్టీ పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశాడు. ఇటు ఆర్జేడీ సైతం తేజస్వి నేతృత్వంలో ఘోర పరాభవం చవిచూసింది. ఆ వెంటనే లాలూ బిడ్డ రోహిణి ఆచార్య సంచలన ఆరోపణలకు దిగింది. తేజస్వి వైఖరి కారణంగానే ఆర్జేడీ ఓటమి పాలయ్యిందని.. పార్టీలో అనవసరమైన వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చి కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత తగ్గించాడని.. ఘోర అవమానాలు జరిగాయని చెబుతూ పార్టీ నుంచి నిష్క్రమించిందామె. ఆ సమయంలో సోదరికి తేజ్ ప్రతాప్ యాదవ్ మద్దతుగా నిలిచారు. అయితే.. బీహార్‌లో ఎన్డీయే కూటమిని ఎదుర్కోవాలంటే ఆర్జేడీ కుటుంబం మళ్లీ ఒక్కటవ్వాలనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.


