
పట్నా: బీహార్‌లో నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో తొలి దశ పోలింగ్‌నకు సంబంధించి, అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతలో ఒక ఉదంతం మీడియా దృష్టిని ఆకర్షించింది. భాగల్‌పూర్ బీజేపీ టికెట్ లభించకపోవడంతో కలత చెందిన మాజీ కేంద్ర మంత్రి అశ్విని చౌబే కుమారుడు అర్జిత్ శశ్వత్ చౌబే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలో వచ్చిన ఒక ఫోన్ కాల్‌తో క్షణంలో అతని నిర్ణయం మారిపోయింది.
నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థి అర్జిత్ శశ్వత్ చౌబే జిల్లా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకోగానే, అతని మద్దతుదారులు అతనికి పూలమాలలు వేసి, మరింత ఉత్సాహపరిచారు. ఇంతలో శశ్వత్ చౌబే ఫోన్ రింగ్ అయ్యింది. అదే సమయంలో అతనితో మాట్లాడేందుకు విలేకరులు వేచివున్నారు. శశ్వత్ చౌబే తనకు వచ్చిన కాల్ తీసుకుని, నామినేషన్ పత్రాలను దాఖలు చేయకుండా వెనుదిరిగారు. తరువాత తాను ఊహించని విధంగా యూ టర్న్ తీసుకోవడానికి గల కారణాన్ని మీడియాకు వివరించారు.
తన తండ్రి అశ్విని చౌబే సూచనల మేరకు బీజేపీలోనే ఉంటానని శశ్వత్ చౌబే స్పష్టం చేశారు. తన తండ్రి మాటను మన్నిస్తూ, ఆయనకు గౌరవాన్నిస్తూ, ఎన్నికల్లో పోటీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించగానే, బీజేపీ అగ్ర నాయకత్వం నుండి ఒత్తిడిని ఎదురయ్యిందని శశ్వత్ చౌబే పేర్కొన్నారు.‘ఈరోజు, నా తల్లిదండ్రులు నాతో మాట్లాడారు. ఇది బీజేపీ అగ్ర నాయకత్వం నుండి వచ్చిన సూచన. నేను వారికి అవిధేయునిగా ఉండలేను. నేను నా పార్టీకి, దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేను.వారిని వ్యతిరేకించలేను’ అని శశ్వత్ చౌబే మీడియాకు తెలిపారు.