
పట్నా: అతను ఢిల్లీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. అంచలంచలుగా ఎదుగుతూ రూ. 400 కోట్ల టర్నోవర్ గల కంపెనీని నడిపేస్థాయికి చేరుకున్నారు. అతనే బీహార్ పారిశ్రామికవేత్త నీరజ్ సింగ్. అతని జీవన ప్రయాణం సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తుంది.38 ఏళ్ల నీరజ్ సింగ్ రాబోయే బీహార్ ఎన్నికల్లో షియోహార్ స్థానం నుంచి జన్ సురాజ్ పార్టీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు.
బీహార్‌లోని షియోహార్ జిల్లాలోని మధురాపూర్ గ్రామంలో జన్మించిన నీరజ్ సింగ్ పదవ తరగతి పూర్తిచేశాక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఉద్యోగాల వేటలో పడ్డారు. ఎటువంటి ఉద్యోగం దొరక్క, గ్రామంలో పెట్రోల్, డీజిల్ విక్రయించడం మొదలుపెట్టాడు. తరువాత ఢిల్లీకి వెళ్లి, సెక్యూరిటీ గార్డు ఉద్యోగంలో చేరారు. అనంతరం పూణేకు చేరుకుని, ఒక ప్రైవేట్ సంస్థలో ఆఫీస్ అటెండెంట్‌గా చేరారు. 2010లో ధాన్యం వ్యాపారాన్ని ప్రారంభించారు. అది కలసివచ్చింది. దీంతో ఇటుకలు, బిల్డింగ్ బ్లాక్స్, టైల్స్, ఇతర సిరామిక్ వస్తువులను విక్రయించే ఉషా ఇండస్ట్రీస్‌ను స్థాపించారు.
తదనంతర కాలంలో సింగ్ తన వ్యాపారాన్ని రోడ్డు నిర్మాణ రంగానికి కూడా విస్తరించారు. ఇటీవలే సొంత పెట్రోల్ పంపును ప్రారంభించారు. నీరజ్ సింగ్ స్థాపించిన కంపెనీ ప్రస్తుతం రూ. 400 కోట్ల టర్నోవర్‌తో, రెండువేల మంది సిబ్బందికి ఉపాధిని అందిస్తోంది. ఒకప్పుడు సైకిల్ కూడా లేని నీరజ్ సింగ్ దగ్గర నేడు అర డజనుకు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. సింగ్ తన ఇద్దరు సోదరులు, భార్య, ఇద్దరు కుమారులు, తల్లిదండ్రులతోపాటు ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. పేద మహిళలకు వివాహాలు చేయడం, సీనియర్ సిటిజన్ల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలు, వృద్ధుల కోసం తీర్థయాత్రలను నిర్వహించడం లాంటి సేవాకార్యక్రమాలను నీరజ్ సింగ్ నిర్వహిస్తున్నారు.