
పట్నా: బిహార్‌లో వచ్చేనెల(నవంబర్)లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో నేతల ప్రచార పర్వం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వీ యాదవ్ రాష్ట్రంలోని మహిళలకు భారీ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘జీవికా దీదీ’లకు ఉద్యోగం పర్మినెంట్ చేయడంతోపాటు, నెలకు రూ.30 వేల జీతం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఎన్‌డీఏ ప్రభుత్వం చేపడుతున్న ‘జీవికా దీదీ’ పథకంలోని లోపాలను చక్కదిద్ది, మహిళలకు అండగా ఉంటామని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు.
ఆర్‌జేడీ నేత నేత తేజస్వీ యాదవ్ తన ఎన్నికల ప్రచారంలో ‘జీవికా దీదీ’లపై హామీల వర్షం కురిపించారు. బిహార్‌లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ‘జీవికా దీదీ’లకు రూ. 30 వేల జీతంతోపాటు వారు తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేస్తామని, బీమా కవరేజీని అందిస్తామని హామీనిచ్చారు. ఎన్‌డీఏ ప్రభుత్వ చేపట్టిన ‘జీవికా దీదీ’ పథకం తీరుతెన్నులపై తేజస్వీ పలు విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ‘జీవికా దీదీ’లకు అన్యాయం జరుగుతున్నదనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
ఈ పథకంలోని మహిళలను పర్మినెంట్ చేయాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని తాము నిర్ణయించామని తేజస్వీ పేర్కొన్నారు. వారి జీతం కూడా నెలకు రూ. 30 వేలకు పెంచుతామని, ఇది సాధారణ ప్రకటన కాదని అన్నారు. జీవికా దీదీల దీర్ఘకాల డిమాండ్ సాకారం చేయనున్నామని తేజస్వి యాదవ్ పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. జీవికా దీదీల ప్రస్తుత రుణాలపై వడ్డీని మాఫీ చేస్తామని, రాబోయే రెండేళ్లకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. దీనికితోడు ప్రతి జీవికా దీదీకి నెలకు రూ. రెండువేల అదనపు భత్యం, రూ. ఐదు లక్షల బీమా కవరేజ్ అందిస్తామన్నారు. కాగా ‘జీవికా దీదీ’ పథకం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కీలకాంశంగా మారింది.