తెగని సీట్ల పంచాయితీ! ఢిల్లీ పెద్దలను ఉరికించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు | Bihar Assembly Election 2025, Congress Leaders Heckled By Workers Videos Viral, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

వీడియో: తెగని సీట్ల పంచాయితీ! ఢిల్లీ పెద్దలను ఉరికించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు

Oct 16 2025 9:41 AM | Updated on Oct 16 2025 11:14 AM

Bihar Assembly Election 2025: Congress leaders Heckled by Workers Viral

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండే రోజులు మిగిలి ఉంది. ఇప్పటికీ బీహార్‌లో విపక్ష మహాఘట్‌ బంధన్‌లో సీట్ల పంపిణీ ఓ కొలిక్కి రాలేదు. ఈ అయోమయం, గందరగోళం నడుమే ఆర్జేడీ 35 మందితో తన జాబితాను విడుదల చేసింది. అదే సమయంలో కాంగ్రెస్‌ కూడా  10 మంది పేర్లను ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

పది మంది అభ్యర్థులకు సింబల్‌ పంపిణీ చేసింది కాంగ్రెస్‌. ఆ ఫొటోలను బీహార్‌ కాంగ్రెస్‌ ఎక్స్‌ ఖాతాలో అధికారికంగా పోస్ట్‌ చేశారు. అయితే.. సీట్ల పంపిణీ లెక్కలు తేలకుండానే కాంగ్రెస్‌ ఈ జాబితాను ప్రకటించిందా? లేదంటే ఒప్పందం ప్రకారమే చేసిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు.. గత అర్ధరాత్రి పాట్నా ఎయిర్‌పోర్ట్‌ వద్ద తీవ్ర కలకలం రేగింది.

బీహార్‌  కాంగ్రెస్‌ ఇంచార్జి కృష్ణ అల్లవరు, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ రాజేష్‌ రామ్‌, సీనియర్‌ నేత షకీల్‌ అహ్మద్‌ ఖాన్‌లు ఢిల్లీలో సీట్ల పంపిణీపై చర్చలు జరిపిన అనంతరం పాట్నా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సంగతి తెలిసి.. బిక్రమ్‌ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టగా.. అది ఘర్షణకు దారి తీసింది.

బీహార్‌లో బిక్రం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధార్థ్ సౌరభ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. తాజాగా.. కాంగ్రెస్‌ ప్రకటించిన పది మంది అభ్యర్థులలోఈ స్థానం కూడా ఉంది. ఇక్కడి నుంచి అనిల్‌ కుమార్‌ పోటీ చేయబోతున్నారు. అయితే.. 

ఈ పరిణామంపై ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు పాట్నా ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకుని తమ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ పెద్దలు రూ.5 కోట్లకు సీటు అమ్ముకున్నారంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో పూర్నియా ఎంపీ పప్పు యాదవ్ మద్దతుదారుడు మనీష్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో అలజడి రేగింది.

దీంతో ఆ ముగ్గురు పెద్దలు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. షకీల్‌ అహ్మద్‌ ఖాన్‌ను కార్యకర్తలు రౌండప్‌ చేయగా.. అతి కష్టం మీద తప్పించుకుని కారులో వెళ్లిపోయారు. తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో ఈ సీటు అభ్యర్థికి మార్పు తప్పదా? అనే చర్చ జోరందుకుంది.

ఇదిలా ఉంటే.. సీట్ల పంపిణీపై చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చివరి దఫా చర్చలు ఇవాళ ఓ కొలిక్కి వచ్చాక.. అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఆర్జేడీ 130, కాంగ్రెస్‌ 60, వీఐపీ 18, వామపక్ష పార్టీలు 35 స్థానాలలో పోటీ చేస్తాయని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.

ఇదీ చదవండి: ట్విస్ట్‌ ఇచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement