
న్యూఢిల్లీ: మేఘాలయ ‘హనీమూన్’ కేసులో భర్త రాజా రఘువంశీని అతని భార్య సోనమ్ హత్య చేయించిదని వెల్లడయ్యింది. సోనమ్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను గురువారం ఇండోర్ నుంచి మేఘాలయకు తీసుకువచ్చారు. పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వారిని షిల్లాంగ్‌లో విచారించనుంది.
సోనమ్ (25),రాజా (29)లకు మే 11న ఇండోర్‌లో వివాహం జరిగింది. వారు హనీమూన్ కోసం మే 20న అస్సాంలోని గౌహతి మీదుగా మేఘాలయకు చేరుకున్నారు. మే 23న సోహ్రాలోని నోంగ్రియాట్ గ్రామంలో అదృశ్యమయ్యారు. జూన్ 2న వీసావ్‌డాంగ్ జలపాతం సమీపంలోని ఒక లోయలో రాజా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. జూన్ 9న తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లో సోనమ్ పోలీసుల సమక్షంలో లొంగిపోయింది. తరువాత ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాతో పాటు రాజాను హత్య చేసిన ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ వివాహానికి ముందే రాజాను చంపడానికి సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో సోనమ్ తాను, తన ప్రియుడు రాజ్‌తో కలిసి ఉండేందుకు భర్తను హత్య చేసినట్లు సోనమ్ అంగీకరించింది. భర్తను దారుణంగా హత్య చేసిన కేసులో సోనమ్‌ను విచారించేందుకు ‘సిట్’ 20 ప్రశ్నల జాబితాను సిద్ధం చేసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రశ్నలివే..
1. మేఘాలయలో మీరు, రాజా హనీమూన్‌ను ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు?
2. రిటర్న్ టిక్కెట్లు ఎందుకు బుక్ చేసుకోలేదు? అది కూడా ప్రణాళికలో భాగమేనా?
3. వివాహానికి ముందు మీకు రాజ్ కుష్వాహా తెలుసా? మీ ఇద్దరి మధ్య పరిచయం ఉన్నట్లు పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి.
4. యాప్ చాట్‌లో హనీమూన్ సమయంలో మీరు రాజ్ కుష్వాహాతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. మీరిద్దరూ దేని గురించి చర్చించుకున్నారు?
5. నిందితునికి మీ లైవ్ లొకేషన్‌ను ఎందుకు పంపించారు?
6. మే 23న మీరు ముగ్గురు వ్యక్తులతో మావ్లింగ్‌ఖైట్‌లో కనిపించారు. వారి గురించి మాకు ఏమి చెబుతారు?
7. మే 22న స్థానిక గైడ్ ఆల్బర్ట్ సర్వీస్‌ను ఎందుకు
తిరస్కరించారు?
8. రాజా హత్య కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తులను గైడ్ ఆల్బర్ట్ గుర్తించాడు. వారిని మీరు, రాజ్ కుష్వాహా నియమించుకున్నారా?
9. రాజా రఘువంశీని హత్య చేయడానికి హంతకులను ఎవరు సంప్రదించారు?
10. రాజా రఘువంశీ హత్య కోసం హంతకులకు ఎంత డబ్బు చెల్లించారు? దానిని ఎవరు చెల్లించారు? అది నగదు రూపంలో లేదా ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా చెల్లించారా?
11. రాజా హత్యకు మేఘాలయను మీరు, రాజ్ కుష్వాహా ఎందుకు ఎంచుకున్నారు? మరెక్కడికైనా వెళ్లాలనే ప్లాన్ మీకు ఉందా?
12. హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగితే, రాజ్ కుష్వాహా మీతో మేఘాలయకు ఎందుకు రాలేదు?
13. హత్య తర్వాత మీరు 17 రోజులు ఎక్కడికి వెళ్లారు? పోలీసుల నుంచి దాక్కునేందుకు మీకు ఎవరు సహాయం చేసారు?
14. రాజా రఘువంశీ హత్య తర్వాత పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఏమి ప్లాన్ చేశారు?
15. రాజాకు చెందిన స్మార్ట్ వాచ్, ఫోనును పోలీసులు కనుగొన్నారు. అయితే రాజాకు చెందిన దాదాపు రూ. 10 లక్షల విలువైన బంగారం కనిపించకుండా పోయింది. దీని గురించి మీరేమి చెబుతారు?
16 రాజాను చంపడానికి ఉపయోగించిన ఆయుధాన్ని మీరు ఎక్కడ కొన్నారు? ఎంతకు కొన్నారు?
17 రాజా తల్లి మీరు మేఘాలయకు వెళ్లడానికి ఇష్టపడలేదని, మీ పట్టుదల కారణంగానే అంగీకరించారని చెబుతున్నారు. మీరు రాజాను బలవంతంగా తీసుకువెళ్లారా?
18. వివాహ వేడుకల సమయంలో సంతోషంగా లేనట్లు వీడియోలలో కనిపిస్తోంది. కారణమేమిటి?
19 మీరు రాజా రఘువంశీని వివాహం చేసుకోకూడదనుకుంటే, ముందుగా మీ కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు?
20. రాజ్ కుష్వాహాతో కలిసి రాజా హత్యకు మీరు ప్లాన్ చేశారా?
ఇది కూడా చదవండి: హనీమూన్ కేసు: సోనమ్ తన మంగళ సూత్రాన్ని తీసేసి..