డేంజర్‌ డోన్‌లో ఢిల్లీ ప్రజలు.. రోజుకి 9 సిగరెట్లు తాగినంత వాయు కాలుష్యం.. | Delhi Air Quality, AQI Hits 429 After Diwali, Doctors Warn Of Cancer Risk | Sakshi
Sakshi News home page

డేంజర్‌ డోన్‌లో ఢిల్లీ ప్రజలు.. రోజుకి 9 సిగరెట్లు తాగినంత వాయు కాలుష్యం..

Oct 23 2025 9:29 AM | Updated on Oct 23 2025 10:59 AM

Delhi Air Quality remains under very poor category

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యం కొనసాగుతోంది. దీపావళి తర్వాత రోజురోజుకీ గాలి నాణ్యత పడిపోతోంది. తాజాగా ఢిల్లీ ఆనంద్ విహార్ ప్రాంతంలో ప్రమాదకర స్థాయికి 429 పాయింట్లకు కాలుష్యం చేరింది. క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలు క్యాన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇక, కాలుష్య కారక గాలి పీల్చడం వల్ల ఢిల్లీలో సగటున ప్రతి మనిషి రోజుకి 9 సిగరెట్లు తాగినట్లు అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారానికి 63 సిగరెట్లు, నెలకి 270 సిగరెట్లు తాగుతున్నట్లు వెల్లడించారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలు క్యాన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. గత మూడు రోజులుగా తారాస్థాయికి వాయు కాలుష్యం చేరి దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్‌గా మారిపోయింది. గాలి పీల్చుకునేందుకు ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, అనవసరంగా బయట తిరగవద్దని వైద్యుల సూచనలు చేశారు.  ఎయిర్ ప్యూరిఫైయర్  తప్పనిసరిగా వినియోగించాలన్నారు. కాగా, దీపావళి, పంట వ్యర్థాలు కాల్చివేత వల్ల వాయు కాలుష్యం భారీగా పెరిగింది.

ఇదిలా ఉండగా.. ఢిల్లీని చుట్టుముట్టిన వాయు కాలుష్యంపై బీజేపీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ అభిషేక్‌ మనుసింఘ్వీ డిమాండ్‌ చేశారు. ఢిల్లీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం కారణంగా ప్రజలు పడే ఇబ్బందులు అంతాఇంతా కాదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ గత మూడ్రోజులుగా దేశ రాజధానిలో గాలి మసిబారిపోయింది. దీనిని పీల్చిన ప్రజల ఊపిరితిత్తులు పొగచూరి నల్లగా మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ జవాబుదారీతనం వీసమెత్తయినా కంటికి కనిపించట్లేదు. పండగల వేళ బీజేపీ నేతలు చేసే జ్ఞానబోధనలు ఎవరికీ అక్కర్లేదు.

ప్రజలు హాయిగా స్వచ్ఛమైన గాలి పీల్చగలిగేలా చేస్తామంటూ బాధ్యత తీసుకునే బాధ్యతాయుత ప్రభుత్వం కావాలి. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు కాలుష్యంతో అతలాకుతలమవుతున్నా బీజేపీ చర్యలు తీసుకోకపోవడం దారుణం’’ అని మనుసింఘ్వీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక పోస్ట్‌ పెట్టారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం బుధవారం ఉదయం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) ‘చాలా అధ్వానం‘గా నమోదైన నేపథ్యంలో మనుసింఘ్వీ స్పందించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement