
కొత్తగా టైబ్రేకర్ షూటౌట్
29 నుంచి ప్రొ కబడ్డీ లీగ్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఫార్మాట్ మారినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 29 నుంచి జరిగే 12వ సీజన్ పీకేఎల్‌ను మారిన ఫార్మాట్ ప్రకారం నిర్వహిస్తారు. మ్యాచ్‌ల్లో రసవత్తర పోటీ పెరిగేందుకు అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని పంచేందుకు ఈ మార్పులు దోహదం చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. కొత్తగా టైబ్రేకర్, గోల్డెన్ రెయిడ్ నిబంధనలను తీసుకొచ్చారు. గతంలో గోల్డెన్ రెయిడ్ కేవలం ప్లేఆఫ్స్‌లోనే ఉండేది. ఇప్పుడు లీగ్ ఆసాంతం కొనసాగిస్తారు. మ్యాచ్ ‘టై’ అయితే కొత్త టైబ్రేకర్‌తో ఫలితం కచ్చితంగా ఫలితం రానుంది.
స్కోరు సమమైన పక్షంలో ఒక్కో జట్టుకు ఫుట్‌బాల్ తరహాలో 5 రెయిడ్ షూటౌట్ అవకాశాలిస్తారు. ఇరు జట్లు ఏడుగురు చొప్పున ఆటగాళ్లను నామినేట్ చేస్తాయి. ఇందులో ఐదుగురు రెయిడ్ చేస్తారు. ‘షూటౌట్’ స్కోరు సమమైతే అప్పుడు గోలెడ్‌న్ రెయిడ్ తెరపైకి వస్తుంది. ఇలాంటి మార్పులతో మ్యాచ్‌లో మరింత నాటకీయత పెరుగుతుందని, ఆటలోనూ పోటీ కూడా అభిమానుల్ని ఆకర్శిస్తుందని పీకేఎల్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సీజన్‌లో లీగ్ దశలో 108 మ్యాచ్‌లుంటాయి. ఒక్కో ఫ్రాంచైజీ జట్టు 18 మ్యాచ్‌లు ఆడుతుంది.
పాత పద్ధతిలో ప్లే ఆఫ్స్ ఉంటాయి... కానీ ఇకపై పాయింట్ల పట్టికలో మొదటి 8 స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్ చేరతాయి. తద్వారా టైటిల్ రేసులో 8 జట్లు పోటీలోనే ఉంటాయి. 5 నుంచి 8వ స్థానంలో నిలిచిన ఫ్రాంచైజీలు ‘ప్లే–ఇన్’ మ్యాచ్‌లు ఆడతాయి. గెలిచిన జట్లు ముందంజ వేస్తాయి. అలాగే 3, 4 స్థానాల జట్లు ‘మినీ క్వాలిఫయర్’ ఆడతాయి. ఇక్కడ గెలిచిన జట్టు ముందుకెళుతుంది. కానీ ఓడిన జట్టు నిష్క్రమించదు. ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్ చేరేందుకు మరో అవకాశముంటుంది.
ఈ ప్రక్రియలో మొత్తం మూడు ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు క్వాలిఫయర్–1 ఆడతాయి. విజేత జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్–2 ఆడుతుంది. ఎలిమినేటర్ ఫలితాల విజేత క్వాలిఫయర్–2కు అర్హత సాధిస్తుంది. అంటే 3 నుంచి 8వ స్థానం వరకు నిలిచే ఏ జట్టయిన ఇకపై ఫైనల్‌కు చేరే అవకాశంఉందన్న మాట!