
టైబ్రేక్‌లో ఓడిన దబంగ్ ఢిల్లీ
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరిన దబంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో పుణేరి పైచేయి సాధించింది. స్కోర్లు సమమైన ఈ మ్యాచ్‌లో పల్టన్ జట్టు ‘టైబ్రేక్’ రెయిడ్‌లతో గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచే పోటాపోటీగా సాగింది. దీంతో నిరీ్ణత సమయం ముగిసేసరికి 38–38తో స్కోరు సమమైంది. పుణేరి రెయిడర్లలో పంకజ్ (7), ఆదిత్య షిండే (6), మోహిత్ (5) క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టారు.
ఆల్‌రౌండర్, కెపె్టన్ అస్లామ్ ఇనామ్‌దార్ (6)తో పాటు, డిఫెండర్ గౌరవ్ ఖత్రి (4) కూడా రాణించాడు. దబంగ్ తరఫున రెయిడర్ అజింక్య పవార్ 10 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో డిఫెండర్ సౌరభ్ (6), ఆల్‌రౌండర్ నవీన్ (5), నీరజ్ నర్వాల్ (4) అదరగొట్టారు. మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన టైబ్రేక్‌లో పుణేరి రెయిడర్లు అందరూ పాయింట్లు తెచ్చిపెట్టడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఈ విజయంతో పట్టికలో టాప్–2 స్థానాలు తారుమారు అయ్యాయి.
అగ్రస్థానంలో ఉన్న దబంగ్ రెండో స్థానానికి, రెండో స్థానంలో ఉన్న పుణేరి పల్టన్ అగ్రస్థానానికి ఎగబాకింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 43–32తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. ఆల్‌రౌండర్ అలీ రెజా (18) చెలరేగాడు. రెయిడింగ్‌లో 16 పాయింట్లు, టాకిల్‌తో 2 పాయింట్లు తెచ్చిపెట్టాడు.
మిగతా సహచరుల్లో రెయిడర్ ఆశిష్ మలిక్ (7), డిఫెండర్ దీపక్ శంకర్ (6)సైతం పోటీపడి పాయింట్లు తెచ్చారు. బెంగాల్ జట్టు రెయిడర్లలో కెపె్టన్ దేవాంక్ (13), హిమాన్షు నర్వాల్ (7) రాణించారు. నేడు జరిగే పోటీల్లో పట్నా పైరేట్స్‌తో హరియాణా స్టీలర్స్, యూ ముంబాతో యూపీ యోధాస్ తలపడతాయి.