
ఐదు పరాజయాల తర్వాత పట్నా పైరేట్స్‌పై విజయం
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో హరియాణా స్టీలర్స్ తమ వరుస పరాజయాల పరంపరకు బ్రేకులేసింది. సోమవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో హరియాణా 39–32తో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. ఐదు పరాజయాల తర్వాత స్టీలర్స్ పట్టుదలగా ఆడి ఈ మ్యాచ్ నెగ్గింది. హరియాణా తరఫున రెయిడర్ శివమ్ (12 పాయింట్లు) కీలకపాత్ర పోషించాడు.
13 సార్లు కూతకెళ్లిన అతను 11 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్‌ను టాకిల్ చేసి మరో పాయింట్ గెలిచాడు. రెయిడర్ వినయ్ (4), ఆల్‌రౌండర్ సాహిల్ నర్వాల్ (3) మెరుగ్గా ఆడగా... డిఫెండర్లలో కెపె్టన్ జైదీప్ (6), రాహుల్ (4), హర్దీప్ (3) రాణించారు. పట్నా జట్టులో రెయిడర్ అయాన్ (17) ఒంటరి పోరాటం చేశాడు. 24 సార్లు కూతకెళ్లిన అయాన్ 15 పాయింట్లు తెచ్చిపెట్టాడు.
టాకిల్‌లోనూ 2 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో డిఫెండర్ నవ్‌దీప్ (4) మినహా ఇంకెవరూ చెప్పుకోదగిన ప్రదర్శనే ఇవ్వలేకపోయారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 40–24తో యూ ముంబాపై విజయం సాధించింది. యోధాస్ జట్టులో రెయిడర్ గుమన్ సింగ్ (12) అదరగొట్టాడు.
సహచరుల్లో భవాని రాజ్‌పుత్ (5), మహేందర్ సింగ్ (4), హితేశ్ (4) ఆషు సింగ్ (3) రాణించారు. యూ ముంబా జట్టులో రెయిడర్లు సందీప్ (7), అజిత్ చౌహాన (5) ఆకట్టుకున్నారు. నేడు ఇదే వేదికపై జరిగే పోటీల్లో పట్నా పైరేట్స్‌తో గుజరాత్ జెయంట్స్, యూపీ యోధాస్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి.