
ఢిల్లీ: హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ ‘టైబ్రేక్’లో పరాజయం పాలైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన పోరులో టైటాన్స్ 5–7 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. మొదట నిర్ణీత సమయంలో ఇరు జట్లు 45–45 పాయింట్లతో సమంగా నిలిచాయి. టైటాన్స్ తరఫున భరత్ 16 పాయింట్లతో సత్తా చాటగా... కెప్టెన్ విజయ్ మలిక్ 6 పాయింట్లు సాధించాడు.
బెంగాల్ వారియర్స్ సారథి దేవాంక్ 18 పాయింట్లతో అదరగొట్టాడు. మన్‌జీత్ 7 పాయింట్లతో అతడికి అండగా నిలిచాడు. దీంతో ఫలితం తేల్చేందుకు ‘టైబ్రేక్’ నిర్వహించగా... బెంగాల్ వారియర్స్ మెరిపించింది. తాజా సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ 8 విజయాలు, 6 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని మూడో స్థానంలో ఉంది. బెంగాల్ వారియర్స్ 14 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 9 ఓడి 10 పాయింట్లతో పట్టిక 11వ స్థానంలో నిలిచింది.
మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 57–33 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. పల్టన్ తరఫున పంకజ్ 9, గౌరవ్ ఖత్రి 7 పాయంట్లు సాధించగా... వైభవ్, అస్లమ్ చెరో ఆరు పాయింట్లు సాధించారు. జైపూర్ తరఫున అలీ సమదీ 14 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన పల్టన్ 16 మ్యాచ్‌ల్లో 13 విజయాలు, 3 పరాజయాలతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది.
ఇంకో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 42–35 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. గుజరాత్ జెయింట్స్ తరఫున హిమాన్షు 13 పాయింట్లు సాధించగా... అంకిత్ దహియా, మొహమ్మద్ రెజా చెరో 6 పాయింట్లు సాధించారు. తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ 12 పాయింట్లతో పోరాడాడు. లీగ్‌లో భాగంగా గురువారం మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. బెంగళూరు బుల్స్‌తో పట్నా పైరేట్స్, తెలుగు టైటాన్స్‌తో యు ముంబా, యూపీ యోధాస్‌తో హరియాణా స్టీలర్స్ తలపడనున్నాయి.