
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్
బెంగళూరు: ఆడాలని ఉన్నా ఆరోగ్యం, శరీరం సహకరించడం లేదని, అందుకే భారమైన హృదయంతో ఆటను మానేశానని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తెలిపారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లా మణిపాల్ పట్టణంలో ఆమె మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఔత్సాహిక క్రీడాకారులకు తర్పీదు ఇచ్చేందుకు కూడా తనకు ఆసక్తి లేదన్నారు. హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ శిక్షణ ఇచ్చేందుకు మంచి అకాడమీలు ఉన్నాయని చెప్పారు.
‘శిక్షణ ఇవ్వడం చాలా కష్టమైన పని. అది ఆడడం కన్నా కష్టం. 10–15 గంటలపాటు నిలబడి శిక్షణ ఇవ్వాలంటే మామూలు విషయం కాదు. అయితే పిల్లలకు ఆటల్లో ఆసక్తి కలిగించేలా పని చేస్తున్నా’ అని వివరించారు. పిల్లలు సోషల్ మీడియాకు స్వస్తి చెప్పి అన్ని రకాల క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. గతంలో తాను జీవితంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యానని, 25 ఏళ్లు కుటుంబం, ఆహారం, స్నేహితులు అందరికీ దూరమైనట్లు తెలిపారు.