
కామన్వెల్త్ స్పోర్ట్స్ బోర్డు సిఫారసు
నవంబర్ 26న లాంఛనంగా ప్రకటన
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలకు భారతదేశం రెండోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. 2030లో జరిగే క్రీడలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదిక కావడం దాదాపుగా ఖాయమైంది. ఈ క్రీడల కోసం బిడ్ వేసిన నగరాలలో అహ్మదాబాద్‌కు క్రీడలు కేటాయించాలంటూ కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సిఫారసు చేసింది. బోర్డు సిఫారసు చేయడమంటే దీనికి దాదాపు అధికారికంగా ఆమోద ముద్ర పడినట్లే. ఇక లాంఛన ప్రకటనే తరువాయి. నవంబర్ 26న జరిగే బోర్డు సమావేశంలో వేదిక పేరును ప్రకటిస్తారు.
అహ్మదాబాద్‌తో పాటు నైజీరియా నగరం అబూజా పోటీలో నిలిచినా... ఎగ్జిక్యూటివ్ బోర్డు భారత్ వైపే మొగ్గు చూపింది. ఆఫ్రికా దేశంలో క్రీడలను మరింత అభివృద్ధి చేసి 2034లో పోటీలు నిర్వహించే దిశగా తాము సహకారం అందిస్తామని కూడా బోర్డు హామీ ఇచ్చింది. 2010లో తొలిసారి న్యూఢిల్లీలో భారత్ కామన్వెల్త్ క్రీడలను నిర్వహించింది. భారత్‌కు ఈ క్రీడల నిర్వహించే అవకాశం రావడం గొప్ప గౌరవమని మాజీ అథ్లెట్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష పేర్కొంది.
2036లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలని ఆసక్తి ప్రదర్శిస్తున్న మన దేశానికి కామన్వెల్త్ పోటీల నిర్వహణతో తమ సత్తా చాటేందుకు తగిన అవకాశం లభిస్తోందని భారత ప్రభుత్వం భావిస్తోంది. ‘భారత క్రీడలకు సంబంధింది ఇదో గొప్ప క్షణం. ప్రపంచ క్రీడల్లో మన స్థాయి పెరుగుతోందని చెప్పడానికి ఇదో సూచిక. మన దేశాన్ని ఆటలో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ఇది సాధ్యమైంది’ అని కేంద్ర క్రీడా మంత్రి మన్‌సుఖ్ మాండవియా స్పందించారు.
2026లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం వేదికవుతోంది. అయితే సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో వీటిని నిర్వహించే ప్రయత్నంలో పలు క్రీడలను తొలగించిన కమిటీ కేవలం రూ.1300 కోట్ల బడ్జెట్‌ను మాత్రమే వీటికి కేటాయించింది. ఈ నేపథ్యంలో 2030లో జరిగే పోటీల కోసం కోసం భారత్ ఎంత మొత్తం కేటాయిస్తుందనేది ఆసక్తికరం. గ్లాస్గోలో తొలగించిన, భారత్‌కు పతకావకాశం ఉన్న అన్ని క్రీడాంశాలను ఇందులో మళ్లీ చేర్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.